2024 సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లు దాఖలు చేయడం, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో ఎంతమంది పోటీ చేయబోతున్నారు అనేది లెక్క తేలింది.
ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో 731 నామినేషన్లు దాఖలుగా చేయగా ఇప్పుడు చివరికి 503 మంది పోటీలో నిలిచారు. 228 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. వివిధ కారణాల చేత కొంతమంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురికాగా మరి కొంతమంది అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్లు నంద్యాల పార్లమెంటు నుంచి అత్యధికంగా 36 మంది పోటీలో ఉండగా అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ నుండి 12 మంది పోటీలో ఉన్నారు.
175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4210 నామినేషన్లు దాఖలు కాగా తిరష్కరణ, ఉపసంహారణల తరువాత చివరకు 2705 మంది బరిలో నిలిచారు. 1505 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. వివిధ కారణాల చేత కొంతమంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురికాగా మరి కొంతమంది అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 48 మంది పోటీపడుతుండగా చోడవరం నుంచి అత్యల్పంగా 6 మంది బరిలో నిలిచారు. ఎన్నికల పర్వంలో నామినేషన్ల ఊసంహారణ కూడా పూర్తి కావడం అభ్యర్థులకి గుర్తులు కేటాయించడం లాంటి కార్యక్రమాలన్నీ పూర్తి కావడంతో రానున్న పద్నాలుగు రోజులు ప్రచారంతో హోరెత్తనుంది.