రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల కుంభకోణంలో డిజైన్ టెక్ సంస్థకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో డిజైన్ టెక్ సంస్థ నిందితుల జాబితాలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవినీతి బాగోతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడుతో పాటు ఈ స్కాంలో ప్రధాన సూత్రధారులైన సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల ఎండీలు, ఇంకా పలువుర్ని నిందితులుగా గుర్తిస్తూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది.. వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అభియోగాలు మోపింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రజాధనం లూటీకి సంబంధించి ముందుగా విచారణ జరిపిన ఈడి కేంద్ర సంస్థ దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ సంస్థ బ్యాంకు ఖాతాలో ఉన్న 31.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఈడి ఆడ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదను అనుసరించి అథారిటీ డిజైన్ టెక్ సంస్థకు నోటీసులు జారీ చేస్తూ గత ఏడాది జూలై 13వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమిక ఉత్తర్వులతో పాటు ఆడ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ ఎండీ, చైర్మన్ వికాస్ ఖన్విల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం తాజాగా తీర్పును వెలువరించారు.
విచారణకు ఆడ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయనే డిజైన్ టెక్ వాదనలను హైకోర్టు త్రోసిపుచ్చింది. కేసు తీవ్రత, ప్రజాధానం లూటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసు తీవ్రత దృష్ట్యా పిటిషనర్ వాదనలు ఆమోదించలేమని చెప్తూ పిటిషన్ ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ తీర్పులో వ్యక్తపరచిన అభిప్రాయాలకు ప్రభావం కాకుండా ఆడ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీచేసిన ప్రాథమిక ఉత్తర్వులపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని డిజైన్ టె2క్ సంస్థకు సూచించింది. ఈడీ ప్రాథమిక జప్తును, అథారిటీ షోకాజ్ నోటీసులను సమర్ధిస్తూ తీర్పునిచ్చింది.