మంగళగిరి సభ జన సందోహం చూసి పచ్చ గుండెల్లో గుబులు మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మంగళగిరిలోలోకేష్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ వచ్చిన పచ్చ ప్రచారంలోని డొల్లతనం నేటి సీఎం జగన్ బహిరంగ సభతో అబద్దమని తేలిపోయింది. మంగళగిరిలో తరలి వచ్చిన అశేష జనసందోహాన్ని చూసి లోకేష్ కు ముచ్చెమటలు పడుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వాస్తవానికి 2014 ఎన్నికల్లో లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండానే అడ్డదారిలో మూడు శాఖలకు మంత్రి అయ్యాడనే అపప్రథను మూటగట్టుకున్నాడు. ఎలాగైనా గెలిచి తీరాలని ఏరికోరి మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకుని, డబ్బును విచ్చలవిడిగా వెదజల్లినా లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యేసరికి ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గెలవడం అసాధ్యం అనే నానుడి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు కాబట్టే చంద్రబాబు తన కుమారుడిని ఎమ్మెల్సీని చేసి మూడు శాఖలకు మంత్రిని చేసాడనే వాదనకు బలం చేకూరినట్లైంది.
అధికారంలో ఉన్నన్ని రోజులు మూడు శాఖలకు మంత్రిగా ఉండి కూడా మంగళగిరిని పట్టించుకోకుండా ఉన్న లోకేష్ కు మంగళగిరి ప్రజలు తగిన బుద్ధి చెప్పడంతో ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరాడనే అపప్రథను పోగొట్టుకునేందుకు లోకేష్ తన టీమ్ తో విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాడు. మంగళగిరిలో గెలిచేది తానేనంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు. కానీ లోకేష్ ఆశలన్నీ నీటిపై రాతలని ఒక్క బహిరంగ సభతో తేలిపోయింది.
సీఎం జగన్ నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో లోకేష్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇప్పటివరకూ గెలిచేది తానే అంటూ ఊహల్లో తేలియాడుతున్న లోకేష్ కి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో అనుభవం అయింది. లోకేష్ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహంతో సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని బీసీ మహిళ అయిన మురుగుడు లావణ్యను పోటీలో నిలబెట్టింది. ప్రస్తుతం సీఎం జగన్ సభకు వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటే లోకేష్ కి మరోసారి మంగళగిరిలో విజయం దక్కే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకనైనా లోకేష్ ఊహల్లో ఊరేగడం మాని రియాలిటీలో ఉండటం మంచిదని, మంగళగిరిలో మారుతున్న సమీకరణాలు చూస్తే లోకేష్ కి షాక్ తగిలేలా ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి .