ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదని, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ వస్తున్నాయి. ప్రతిపక్షాలకన్నా ఎక్కువగా ఎల్లో మీడియా జగన్ పై అక్కసుతో ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వస్తుంది. కానీ ఎల్లో మీడియా రాయకున్నా, ప్రతిపక్షాలు గుర్తించకున్నా జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎప్పటికప్పుడు ఏదొక సంఘటన ద్వారా తేటతెల్లం అవుతూనే ఉంది. తాజాగా ఇతర రాష్ట్రానికి చెందిన ఓ మాజీ ఐపిఎస్ అధికారి ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన వెల్లడించిన విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి..
వివరాల్లోకి వెళితే గతంలో బెంగుళూరు కమిషనర్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు అనంతరం ఏడీజీపీగా పని చేసి రిటైర్ అయ్యారు. కాగా ఆయన ఏప్రిల్ 23న అనంతపురం, కదిరి రహదారి మధ్యలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో భాస్కర్ రావును దగ్గర్లో ఉన్న బాత్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఈయనతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఆంధ్రప్రదేశ్ నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరణ చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుతున్న వైద్యాన్ని చూసిన భాస్కర్ రావు ఆశ్చర్యపోయారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది పనితీరును చూసి వీటన్నింటి వెనుక ఉన్న ఏపీ సీఎం జగన్ పనితీరును ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న అంబులెన్స్ ద్వారా ఆయనను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.
అనంతరం సోషల్ మీడియా వేదికగా ఇంకా కొందరు మంచి నాయకులు ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ, ప్రభుత్వాలను నడిపిస్తున్నారంటూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసారు. ఇప్పుడీ వ్యవహారం మొత్తాన్ని ఆయన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.. ఏపీ సీఎం జగన్ నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను, ఆసుపత్రులను సమూలంగా మార్చేసారని గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని చేరిపేసారని, సంక్షేమ పథకాలు అందిస్తూనే అద్భుతమైన అభివృద్ధి చేసి చూపారని, రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన మార్పు మొత్తం ఆయన చేసిన అభివృద్దే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.