రాష్ట్రంలోని ఉపాధ్యాయ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా మొదట ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఫిభ్రవరి మొదటి తేదీనుండి దరఖాస్తులు స్వీకరించనున్న ప్రభుత్వం వచ్చే దరఖాస్తులను బట్టి పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుంది. టెట్, డీఎస్సీ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. కాగా టెట్ మార్కులకు డిఎస్సిలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ప్రభుత్వం ఎట్టకేలకు డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.