Chandrababu : చంద్రబాబు ఓటమిని ముందుగానే పసిగట్టారా? అందుకే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలనుండి తప్పుకుంటా అంటున్నారా అనే సందేహాలు రాజకీయవర్గాల్లో ఏర్పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొనేందుకు ధైర్యం లేక టీడీపీ జనసేన జట్టుకట్టాయి. జరగబోయే ఎన్నికల్లో విజయం తమదే అనే ధీమా మూడు ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తుండగా ఎన్నికల సర్వేలన్నీ అధికార వైఎస్సార్సీపీ కే అనుకూలంగా వస్తుండటం వల్ల ప్రత్యర్థుల్లో వణుకు మొదలైంది. తాజాగా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు చంద్రబాబు (Chandrababu) ఇచ్చిన సమాధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పకుంటారా అని చంద్రబాబును ప్రశ్నించగా దానికి సమాధానంగా ‘ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను.. నేను ప్రజల తరఫున వారి కోసం పోరాటం చేస్తున్నాను.. ప్రజలు ఆ విషయాన్ని ఆలోచిస్తారని అనుకుంటున్నా.. ఒకవేళ మమ్మల్ని తిరస్కరిస్తే నేనెందుకు బాధపడతాను. ప్రజలు తిరస్కరిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారాయి.
చంద్రబాబు ఓటమి భయంతోనే ఈ వ్యాఖ్యలు చేసారంటూ రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. అధికార వైఎస్సార్సీపీని ఢీకొట్టడానికి టీడీపీ జనసేనతో కలిసి పొత్తుతో వచ్చినా సరే తన సంక్షేమ పాలనతో ప్రజల మనసులు గెలుచుకున్న జగన్ కే ఏపీ ప్రజలు పట్టం కట్టనున్నారని పలు సర్వేలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. కుప్పంతో సహా 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేందుకు జగన్ వ్యూహాలు రచిస్తుంటే చంద్రబాబు ఇలా రాజకీయాల నుండి తప్పుకుంటానని వ్యాఖ్యానించడం ఆ పార్టీకి గెలుపు ఆశలు లేవని స్పష్టం చేస్తుండగా కేవలం సానుభూతి కోసమే చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేసారని మరికొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు నోటివెంట రాజకీయాల నుండి తప్పుకుంటాననే వ్యాఖ్యలు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.