ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మేనిఫెస్టోలో రైతులపై వరాల జల్లును కురిపించిన చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటిస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. తన 14 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను అష్టకష్టాలు పెట్టి వారి ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి పోతాడు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే చంద్రబాబు పాలనలో రైతాంగం ఎంతగా నష్టపోయిందో అర్థం అవుతుంది.
2002 లో పెదగార్లపాడు గ్రామంలో మాడిశెట్టి కోదండ రామయ్య అనే కౌలు రైతు వ్యవసాయంలో ఏర్పడిన నష్టాల కారణంగా, అప్పటి టీడీపీ ప్రభుత్వ సాయం దక్కక ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ కూలీగా ఉన్న కోదండ రామయ్య వ్యవసాయంపై నమ్మకంతో 4 ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి, ఒక ఎకరంలో మిర్చి సాగుచేశాడు. కానీ అనుకున్నంత దిగుబడి రాకపోవడం, మద్దతు ధర లేకపోవడం, నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోవడంతో ఆర్ధిక బాధలు తాళలేక తన ఆయువు తీసుకున్నాడు.
అతని చావుకి చంద్రబాబు ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలే కారణమని నాటి సి.పి.ఐ. రాష్ట్ర సమితి కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, దానివల్ల ఏ పంట పండించినా రైతుకు మద్దతు ధర లభించడం లేదని, రైతులను ఆదుకోవడ నికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, గ్రామీణ రుణ విమోచన చట్టం పునరుద్ధరించి పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో రుణాలు మాఫీ చేయాలని, పంటల బీమా పథకం సవరించి రైతులకు అనుగుణంగా మార్పులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు విధానాల కారణంగానే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని అందుకే టీడీపీని ఓడించాలని రైతులకు పిలుపునిచ్చారు.
కాగా నాడు వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతులతో ఛీకొట్టించుకున్న చంద్రబాబు ఇప్పుడు రైతుల కష్టాలను తీరుస్తానంటూ మేనిఫెస్టోలో ప్రకటించి మొసలి కన్నీరు కార్చడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. రైతులను మోసం చేసేందుకు కొత్త హామీలతో చంద్రబాబు వస్తున్నాడని ఆయన రైతు వ్యతిరేకి అని రాష్ట్రంలో పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. కూటమికి ఓటేస్తే రైతుల ఆత్మహత్యలకు మరోసారి అవకాశం ఇచ్చినట్లే అని అందుకే చంద్రబాబును ఓడించి రైతును రాజుగా చూసే సీఎం జగన్ ని గెలిపించుకోవాలని రాష్ట్రంలో పలువురు రైతులు వెల్లడిస్తుండటం గమనార్హం.