ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ , టిడిపి వారి మీద చర్యలు తీసుకోమని సిఐడికి ఆదేశించింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాక్కుంటారని టిడిపి విష ప్రచారం చేస్తుందని.. ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందని, దేశంలోఉన్న భూ విబేధాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ ఫిర్యాదులో పొందుపరిచారు. సరిహద్దు తగాదాలు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోందని వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టనట్లు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చేస్తున్న విష ప్రచారాన్ని ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్‌కు విరుద్దంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ.. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.