ప్రజా క్షేత్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన అస్త్రమైన సోషల్ మీడియాని వాడుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, అభ్యంతరకర పోస్టులు పెట్టిస్తూ వస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర పోస్టులపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ చానల్స్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా టిడిపి పార్టీ అసభ్యకర ప్రచారానికి పాల్పడుతోందని, సీఎం జగన్ వ్యక్తిత్వంపై దాడి చేస్తుందని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ పై పెట్టిన పోస్టుల గురించి వైఎస్ఆర్సిపి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుని పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి సోమవారం నోటీసులు జారీ చేశారు. వైయస్ జగన్ ను కించపరిచేలా టిడిపి సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతకర పోస్టులు 24 గంటల్లో తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఈవో స్పష్టం చేశారు.
ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు తర్వాత లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పై అసభ్యకర ప్రచారాన్ని , అభ్యంతరకర పోస్ట్లు ఏమైనా కనిపిస్తే వైఎస్ఆర్సిపి పార్టీ లీగల్ సెల్ కంప్లైంట్ ఇస్తే తాము ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. 2014 నుంచి 2019 దాకా ఎన్డీఏ కూటమి ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చేసుంటే అది చెప్పుకోవాలి కానీ, వ్యక్తిగత దూషణలు ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన వారిలో లీల అప్పిరెడ్డి తో పాటు ఎమ్మెల్యే మద్దాలి గిరి, పార్టీ నాయకులకు అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి ఉన్నారు.