విశాఖపట్నంపై రామోజీరావు ఈనాడు పత్రిక కక్ష కట్టింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం విషపు రాతలు రాస్తూనే ఉంది. ఏ ఘటన జరిగినా దానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణమని చూపించేందుకు వైజాగ్ ఇమేజీని దారుణంగా డ్యామేజీ చేస్తోంది. స్థిరాస్తి వ్యవహారంలో గ్రామీణ తహసీల్దార్ రమణయ్య హత్య జరిగింది. అయితే ఈ ఘటనను తమకు అనుకూలంగా వాడుకునేందుకు అటు ఎల్లో మీడియా, ఇటు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. ఈనాడు అయితే ఒకడుగు ముందుకేసి అమ్మో విశాఖ.. అరాచకశక్తుల అడ్డా.. రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారని అని రాసేసింది. ఇక్కడ ఏదో జరిగిపోతోందని మిగిలిన ప్రాంతాల వారికి చూపించే కుట్ర ఇది. నిజానికి బాబు అమరావతి మాటున చేసిన దోపిడీ అందరికీ తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. దీంతో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, నధ్యాంధ్ర సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటే బాగుంటుందని చెప్పారు. పైగా అధికార వికేంద్రీకరణ దేశంలో కొత్త కాదు. పలు రాష్ట్రాల్లో ఈ విధానం ఉంది. దీంతో బాబు కుట్రలకు తెరతీశారు. విశాఖ రాజధాని కావడం ఏ మాత్రం ఇష్టం లేని ఆయన ఎల్లో మీడియా, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని బాహాటంగానే వ్యతిరేకతను చూపిస్తున్నారు. నిత్యం దుష్ర్పచారం చేయిస్తూనే ఉన్నారు.
జగన్ ప్రభుత్వం ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. దీని ఫలితంగా నీతి ఆయోగ్ గ్రోత్ హబ్‌లో ఈ నగరానికి చోటు దక్కింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకక ప్రాంతం ఇదే. శంషాబాద్ నుంచి విశాఖకు హైస్పీడ్ రైలు నడిచేందుకు రైల్వే శాఖ సర్వే చేస్తోంది. దీనిపై ఏపీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేసింది. రుషికొండ ఐటీ సెజ్‌లో హిల్ నంబర్-2లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారభించారు. వెయ్యి మంది ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహించింది. జీ-20 సన్నాహక సదస్సు, ఐటీ సదస్సులు జరిగాయి. రూ.500 కోట్లకు పైగా నిధులతో రోడ్ల రూపురేఖలు మార్చేశారు. ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టారు. స్టార్ హోటళ్లకు కేరాఫ్‌గా ఈ ప్రాంతం మారింది. పరిశ్రమలు వస్తున్నాయి. నాలుగేళ్లలో విశాఖకు కొత్త రూపు తెచ్చారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న ఈ ఊరిలో అరాచక శక్తులు రాజ్య మేలుతున్నాయని ఈనాడు రాసినంత మాత్రాన అది నిజమైపోతుందా.. దానికి చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యం. అందుకు ఎంతకైనా తెగిస్తుంది. రామోజీరావుకు సింహాద్రి అప్పన్న కాస్త బుద్ధి ప్రసాదిస్తే బాగుంటుందనే అభిప్రాయం విశాఖ అభివృద్ధిని కాక్షించే ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది.