దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో వ్యవస్థలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్లిపోయాయి. యంత్రంగమంతా ఈసీ ఆదేశాల మేరకే పనిచేస్తోంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఈనాడు అలియాస్ ఈనాయుడు నాటకాలు ఆడుతూ అతి తెలివి ప్రదర్శిస్తోందని విమర్శలున్నాయి. ఎన్డీఏలో చేరేశాం కదా.. ఇక దిగుల్లేదని తెలుగుదేశం అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, వస్తువులు పంచుతున్నారు. కానీ ఈసీ ఊరుకోదు కదా.. కొరడా ఝుళిపిస్తోంది. అయితే రామోజీరావు పత్రిక వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోందని ఎప్పటిలాగే గగ్గోలు పెడుతోంది.
వేగేశన నరేంద్రవర్మ బాపట్ల అసెంబ్లీకి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు చీరాల మండలం కావూరివారిపాళెం పంచాయతీ పరిధిలో రాయల్ మెరైన్ అనే రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. దానిని అడ్డం పెట్టుకుని కొంతకాలంగా రొయ్యల బాక్సుల్లో నగదు పెట్టి కంటైనర్లలో తరలిస్తున్నారని ప్రచారం ఉంది. ఎన్నికల నేపథ్యంలో డబ్బు పంపిణీ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎన్నికల అధికారులకు సమాచారం ఉంది. దీంతో వారంతా అప్రమత్తమయ్యారు. గురువారం చీరాలలోని సదరు యూనిట్లో ఆదాయపుపన్ను అధికారులు, పోలీసులు తదితరులు దాడుల చేయగా రూ.56 లక్షల నగదు లభ్యమైంది. తనిఖీలు పూర్తి స్థాయిలో చేస్తే రూ.కోట్లలో నగదు నిల్వలు బయటపడే అవకాశాలున్నాయి.
వెంటనే ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. జగన్ ప్రభుత్వం ప్రోద్భలంతోనే తనిఖీలు చేస్తున్నారని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఈనాడైతే ఒక్క టీడీపీ అభ్యర్థి సంస్థపైనే దాడులు చేయడం చర్చనీయాంశమైంది. నరేంద్రవర్మ లక్ష్యంగా దాడులు జరిగినట్లు రాజకీయ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ఇంకా నాలుగు యూనిట్లు ఉంటే వాటి జోలికి పోలేదు. అంటూ అవగాహన లేకుండా రాసుకొచ్చింది. అసలు ఇప్పుడు అధికారులంతా ఈసీ చేతుల్లో ఉన్నారని ఈ పత్రికకు తెలుసు. అక్కడ పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న విషయం ఐడియా ఉంది. తప్పుడు పని చేస్తూ టీడీపీ అభ్యర్థి దొరికితే రామోజీరావు వెనుకేసుకు రావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో యంత్రాంగానికి అధికార, ప్రతిపక్షమనే తేడాలుండవు. అనుమానం వచ్చిన ప్రతిచోటా తనిఖీలు చేస్తారు. ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే దాడులు చేస్తారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూసేందుకు బృందాలు పనిచేస్తాయి. అయినా వక్రభాష్యాలు చెప్పి ఈనాయుడు నవ్వులపాలైంది.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలు వస్తువుల, నగదు పంపిణీ చేసేందుకు డంప్ చేసినట్లు రోజూ ఏదో ఒక చోట బయటపడుతోంది. పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర పెద్ద ఎత్తున సైకిళ్లను దాచిపెట్టారు. అధికారులకు సమాచారం అందడంతో దాడులు చేసి యువతులకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన 567 సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా ఈనాయుడు అధికార పార్టీ కుట్రలని ఏడుస్తోంది. తప్పు చేసిన వారిని లెంపకాయ కొట్టకుండా వెనుకేసుకొస్తే ఇంకా రెచ్చిపోతారనే విషయం రామోజీరావుకు తెలుసు. కానీ చంద్రబాబు కోసం దిగజారక తప్పలేదు.