ఎన్నికల వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలలోని కీలక నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం, బీజేపీల నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కీలక నేతలు చేరారు.
ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ వైయస్సార్సీపీలో చేరారు.
కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి అధికార వైసీపీలో చేరారు.
భారతీయ జనతాపార్టీ నుంచి మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు.
కాగా ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సీఎం జగన్ కొనసాగిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలనుండి అశేష స్పందన లభిస్తుంది. ప్రజలంతా సీఎం జగన్ కు బ్రహ్మరథం పడుతుండగా జగన్ సమక్షంలో పలువురు నేతలు వైసిపిలో చేరుతున్నారు.