జనసేన టీడీపీ పొత్తులో లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా చంద్రబాబు రెండు స్థానాల్లో ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని సున్నితంగా దుయ్యబట్టిన పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను సంప్రదించకుండా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుబట్టిన పవన్ కళ్యాణ్ ప్రతిగా తానూ రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించడం విశేషంగా మారింది.
నిజానికి పొత్తు విషయంలో కిందిస్థాయి జనసైనికులలో, ఓ సామజిక వర్గంలో తీవ్రమైన అసంతృప్తి ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీనియర్ నేత హరిరామజోగయ్య పొత్తు విషయంలో జనసేన 60 సీట్లకంటే తక్కువ సీట్లను అడగకూడదని బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన టీడీపీ కూటమిలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని వ్యాఖ్యానించడం కూడా జనసేన కేడర్ లో తీవ్ర అసంతృప్తికి కారణం అయింది. అప్పట్లో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించనప్పటికీ ప్రస్తుతం తన మనసులో మాట బయటపెట్టడంతో తాను కూడా అసంతృప్తితో ఉన్నానని ప్రకటించినట్లైంది.
జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ను సంప్రదించకుండా చంద్రబాబు మండపేట, అరకు నియోజకవర్గాల అభ్యర్థులను చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయనుందని ప్రకటించారు. తనను వీధి కుక్క అని తిట్టినా భరించానని, జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామని చెప్పుకొచ్చిన పవన్ టీడీపీ పొత్తు ధర్మం పాటించకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ నోరు విప్పి తన అసంతృప్తిని వెళ్లగక్కడంతో జనసేన కేడర్ లో ఉత్సాహం వచ్చినట్లైంది. కాగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఎలాంటి సంచలనాలు కలగనున్నాయో కొద్దిరోజులు వేచి చూస్తే తెలుస్తుంది.