సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరుద్యోగుల కోసం 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. 2019 నుంచి విద్యారంగంలో జగన్ ప్రభుత్వం 14,219 పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి 16వ తేదీన వైఎస్సార్ చేయూత 4వ విడత కింద 26,98,931 మంది మహిళలకు 5 వేల కోట్ల రూపాయలకు పైగా అందించేందుకు, ఇంధన రంగంలో 22 వేల కోట్ల రూపాయలతో పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గం నిర్ణయం ప్రకారం ఇక నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉంటారు. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఓకే చెప్పారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు ఓకే చెప్పారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణు మీడియాకు వెల్లడించారు.
నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మెగా డీఎస్సీ నిర్వహణకు ఇక వేగంగా అడుగులు పడనున్నాయి. ఇప్పటికే మహిళలకు అనేక పథకాల ద్వారా అండగా నిలిచిన ప్రభుత్వం మరోసారి వారికి చేయూత ద్వారా భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో భాగంగా విండ్ పవర్ ప్రాజెక్టులకు ఓకే చెప్పడం విశేషం.