ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం వాడివేడిగా సాగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారాలు ఎన్నికల వాతావరణాన్ని మరింత హీటేక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నాయకులకు మద్దతు తెలిపేందుకు అనేక మంది వివిధ రంగాల నుంచి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఎవరి అభిమాన నాయకుల కోసం వారు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో ఎవరు శాశ్వతమో జనానికి వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.
ఆ క్రమంలోనే ప్రముఖ నటుడు కమెడియన్ గౌతమ్ రాజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీత గారికి మద్దతుగా తన గళాన్ని వినిపించాడు. ఆమె కాకితో కబురు పెడితే చాలు కష్టాన్ని తీర్చగల సమర్ధురాలు వంగా గీత గారు అంటూ గతంలో ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యురాలుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆమె చేసిన అనేక మంచి పనులను గుర్తు చేశారు. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం జగన్ నాయకత్వంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె విశిష్టమైన సేవలు అందించారని, వైయస్ జగన్ గారి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసిందని తెలిపారు.
అయితే ప్రభుత్వం నుంచి మేలు పొంది కూడా సంక్షేమ పథకాలు అందుకొని కూడా మనం మనకి మంచి చేసిన వాళ్లకు కాకుండా ఊకదంపుడు ఉపన్యాసాలతో జనాలను ఏమార్చే వారికి ఓటు వేయటం విశ్వాసఘాతుకమని అన్నారు. స్థానికంగా మనకోసం ఎవరు ఉండి పాటు పడతారో వారిని మన అభ్యర్థులుగా ఎన్నుకోవడం భవిష్యత్తులో మనకి మంచిదని టూరిస్టుల్లా వచ్చి పోయే వాళ్లను నమ్ముకుంటే మోసపోవడం తప్పదని తేల్చి చెప్పారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, లేదంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందాన మిగిలిపోతామని హెచ్చరించారు.