బీజేపీ ఎంపీ, అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదైంది. షెల్ కంపెనీ ద్వారా ఫోర్జరీ సంతకాలు చేసి సుమారు రూ.450 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సినీ నటుడు తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు పిర్యాదు చేశారు. కాగా సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీకి ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఫండ్ ఇవ్వకుండా కాంగ్రెస్ కు 30కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఆ వివాదం సద్దుమణగకముందే ఫోర్జరీ కేసు నమోదవడం గమనార్హం. రిత్విక్ స్వాతి అనే బోగస్ కంపెనీ పేరిట సబ్‌కాంట్రాక్టు ఒప్పంద పత్రాలు సృష్టించి సీఎం రమేశ్, ఆయన సన్నిహితుడు పి. నాగేశ్వరరావు ఫోర్జరీ సంతకాలతో మోసానికి పాల్పడినట్లు పిర్యాదు చేయడంతో వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు.
ఉత్తరాఖండ్‌లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు వద్ద సివిల్ ప్రాజెక్టు కాంట్రాక్టును పీసీఎల్ ఇంటర్‌టెక్ కన్సార్షియం దక్కించుకుంది. కొంతకాలం తర్వాత తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పీసీఎల్ ఇంటర్టెక్కు మధ్య విభేదాలు రావడంతో రెండు కంపెనీల మధ్య పంచాయితీ ఢిల్లీ కోర్టుకు చేరింది.కాగా పీసీఎల్ కన్సార్షియంకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని టీహెచ్‌డీఏ న్యాయస్థానంలో డిపాజిట్ చేసింది. ఈ నేపథ్యంలో పి. నాగేశ్వరరావు అనే వ్యక్తిని పీసీఎల్ ఇంటర్‌టెక్ కన్సార్షియం జనరల్ పవర్ ఆఫ్ అటర్నీగా ఉన్నట్లు ఫోర్జరీ సంతకాల ద్వారా కథ నడిపించారు. అనంతరం సీఎం రమేశ్‌కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతికి టీహెచ్‌డీఏ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన పీసీఎల్ ఇంటర్‌టెక్ ట్రూత్‌ల్యాబ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించడంతో పి. నాగేశ్వరరావు, రిత్విక్ స్వాతి కంపెనీ ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిర్దారణ అయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు.
కాగా ఈ కేసులో సీబీఐ విచారణ జరగాలని కావూరి భాస్కర్‌రావు డిమాండ్ చేశారు. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లను సీఎం రమేష్ కొల్లగొట్టారని సీబీఐ విచారణ జరిగితే వేల కోట్ల స్కామ్ లు బయటపడతాయని కావూరి భాస్కరరావు వెల్లడించారు.