2024 సార్వత్రిక ఎన్నికలకు 20 రోజులు సమయం కూడా లేదు వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. టిడిపి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99 శాతం ఆ పథకాలన్నీ అమలు పరిచాడు. ఈసారి ప్రకటించే పథకాలు హామీలు 100 శాతం అమలుపరిచే విధంగా ఉండేలా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తి స్థాయిలో మేనిఫెస్టో రూపకల్పన చేసినప్పటికీ తుది మెరుగుల కోసం రేపు పార్టీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.
ఈ నెల 26, 27 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే పలుసార్లు మేనిఫెస్టోని విడుదల చేస్తాం అంటూ తేదీలు ప్రకటించినప్పటికీ ఎలక్షన్ షెడ్యూల్ లేట్ అవ్వడంతో మేనిఫెస్టోను విడుదల చేయడంలో వైఎస్ఆర్సిపి కాస్త ఆలస్యం చేసింది. మేనిఫెస్టో పూర్తిస్థాయిలో ఇప్పటికే కూర్పు అయినప్పటికీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలతో దగ్గరగా మమేకమవడంతో మేనిఫెస్టోలో ఒకటి రెండు మార్పులు చేసి పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడానికి రేపు పార్టీ ముఖ్య నాయకులతో విశాఖ జిల్లాలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఖరారు చేయడంలో తుది కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు. కాగా ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ నాయకులు వెల్లడించారు.