ఏపీలో జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలుస్తూ వారిని అన్నివిధాలుగా ఆదుకుంటుంది. చంద్రబాబు పాలనలో ఆక్వా రైతులను నిర్లక్ష్యం చేయడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పలు విధాలుగా నష్టపోయారు. ఆ ఇబ్బందులను గుర్తించిన సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించేందుకు నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50లకే విద్యుత్ సరఫరా చేస్తుంది.
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2016 వరకు స్లాట్ల ఆధారంగా ఆక్వా రైతులపై మోయలేని విద్యుత్ భారాన్ని మోపింది. ఆక్వా సాగుపై విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.4.63 నుంచి రూ.7.00 వరకూవేయడంతో రైతులపై ఎనలేని భారం పడింది. అనంతరం 2016 నుండి 2018 వరకూ యూనిట్ రూ.3.86 కి సరఫరా చేసిన టీడీపీ ఎన్నికలకు కొద్దినెలల ముందు హడావిడిగా యూనిట్‌కు రూ.2 చొప్పున ఇచ్చింది. ఆక్వా రైతులకు ఇచ్చిన సబ్సిడీ భారం రూ.312.05 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించకుండా బాకీ పెట్టడంతో తదనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ బాకీని తీర్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 4.65 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 2019 నుండి ఆక్వా జోన్ పరిధిలో ఉన్న 10 ఎకరాల్లోపు సాగు చేస్తున్న 3.56 లక్షల రైతులకు యూనిట్ రూ.1.50లకే విద్యుత్ సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో 64,645 ఆక్వా చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా వాటిలో 50,659 కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసింది. ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీతో సగటున ప్రతీ రైతుకు సబ్సిడీ రూపంలో రూ.7 లక్షల మేర లబ్ధి చేకూరగా, మొత్తంగా నాలుగున్నరేళ్లలో 3,496 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇచ్చింది .
రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఆక్వా రైతుల కోసం ప్రత్యేకంగా మత్స్య యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండేందుకు సాధికార కమిటీ ద్వారా వివిధ కౌంట్ల రొయ్యలకు కనీస కొనుగోలు ధరలను నిర్ణయించింది. రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోలు ధరల పట్టికతో పాటు ఏ రైతుకైనా రొయ్యల అమ్మకంలో ఇబ్బంది ఎదురైతే తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు కాల్ సెంటర్ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది.