2024 సార్వత్రిక ఎన్నికలకి రెండు వారాల గడువు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం సిద్ధం పేరుతో మూడో విడత ప్రచారాన్ని అనంతపూర్ జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం వైఎస్ జగన్ మరో ఎన్నికల ప్రచార భేరి మోగించారు.
మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఈనెల 24వ తేదీకి పూర్తి చేసుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తి అయిన మరుసటి రోజు పులివెందులలో భారీ బహిరంగ సభలో పాల్గొని, సభ తర్వాత నామినేషన్ సీఎం జగన్ దాఖలు చేశారు. ఈ నెల 26వ తేదిన మేనిఫెస్టో తుది మెరుగులు కోసం పార్టీలోని ముఖ్యమైన నాయకులతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయిన తర్వాత 27వ తేదిన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మొదటి సభ ఈరోజు తాడిపత్రిలో జరగబోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ పూర్తిస్థాయిలో నెరవేర్చడంతో అవే పథకాలు కొనసాగింపుగా ఈ మేనిఫెస్టో కొనసాగుతుంది అనే దాని పైనే ప్రచారం కొనసాగిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ప్రతిరోజు మూడు భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు.