ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజా క్షేత్రంలోకి వస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శనివారం ప్రకటించారు. ఆదివారం జగన్ రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో వైఎస్సార్ సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సభ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజానీకం జగన్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగుచోట్ల సిద్ధం నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని జగన్ పూరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఇవి జరిగాయి. లక్షల మంది పోటెత్తారు. ఇదే స్ఫూర్తితో మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం నిర్వహించారు. లక్షలాది మందితో మమేకమయ్యారు. నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి అభ్యర్థులను పరిచయం చేశారు. ప్రతిపక్షాలను ఎండగట్టారు. తాజాగా సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఏ జిల్లాలో ఎన్ని సభలు ఏర్పాటు చేయాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికల వరకు జగన్ మరోసారి ప్రజల్లోనే ఉండనున్నారు. శనివారం ఆయన తన పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. దీంతో సభలకు ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 – 24 వరకు చేసిన పాలన గురించి చెబుతూనే.. వచ్చే ఐదు సంవత్సరాల్లో చేయబోయే పనులను వివరించనున్నారు.