నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. సీఎం వైయస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగిందని గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలని సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నానని సీఎం జగన్ వెల్లడించారు.
మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగిందని పేర్కొన్న జగన్, చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లున్నాయి. లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. 90 శాతం ఇళ్లకు లంచాలకు తావులేకుండా లబ్ధి జరిగింది. మంగళగిరిలో పేదలకు 54వేల ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసి చంద్రబాబు అడ్డుకున్నాడు. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించాలని సీఎం జగన్ సూచించారు.