రాజ్యసభ అభ్యర్థులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డిలకు సీఎం జగన్ బీ ఫామ్ అందజేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జగన్ చేతులు మీదుగా బీ ఫామ్ అందుకున్న వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ లు వేసేందుకు గడువు ఉండగా 27వ తేదీన పోలింగ్ జరుగనుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా పోటీ పడుతున్న ముగ్గురు నాయకులను సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఖరారు చేయడం గమనార్హం. వీరిలో వైవీ సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేసారు. టీటీడీ చైర్మన్ గా కూడా సేవలందించారు. వైఎస్ జగన్ కి దగ్గర బంధువు కూడా. గొల్ల బాబూరావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. మొదట ఏపీపీఎస్సీలో గ్రూపు అధికారిగా ఉన్న గొల్ల బాబూరావు 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మేడా రఘునాథరెడ్డి స్థిరాస్తి వ్యాపారి కావడం విశేషం. రఘునాథ రెడ్డి సోదరుడు మేడా మల్లికార్జున రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా సంఖ్యాబలం కారణంగా మూడింటికి మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయంగా మారింది.