సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నెల్లూరు నగరంలో ఎన్నికల సభ నిర్వహించనున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. 4వ తేదీన సిటీ నియోజకవర్గ పరిధిలో సభ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ హెలికాప్టర్లో వీఆర్సీ మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, సీఎం టూర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం శుక్రవారం పరిశీలించారు.
ధనవంతుడైన పొంగూరు నారాయణకు నెల్లూరు సిటీలో టీడీపీ అవకాశమిచ్చింది. వైఎస్సార్సీపీ ముస్లిం వర్గానికి చెందిన సామాన్యుడైన ఖలీల్ అహ్మద్‌ను నిలబెట్టింది. శుక్రవారమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చి నారాయణ తరఫున ప్రచారం చేసి వెళ్లారు. ఒక్కరోజు గ్యాప్‌లో జగన్ వస్తుండడంతో జనం రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పెత్తందారులకు సీఎం ఎలాంటి కౌంటర్లు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు. కాగా సభ విజయవంతం చేసేందుకు నేతలు కృషి చేస్తున్నారు.
ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ఆత్మకూరు, సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు, కావలి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. కానీ వాటికి ప్రజల నుంచి అంతంతమాత్రంగానే స్పందన వచ్చింది. తెలుగు తమ్ముళ్లే లైట్ తీసుకోవడంతో డబ్బులిచ్చి జనాన్ని తరలించారు. జన సమీకరణలో విఫలమయ్యారంటూ బాబు కూడా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే జగన్‌కు మాత్రం జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. తొలుత మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరిగింది. నెల్లూరు రూరల్ నుంచి ప్రారంభమై కోవూరు, కావలి మీదుగా కందుకూరు వరకు సాగింది. కావలిలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం తన పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. ఎల్లో గ్యాంగ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం నాటి సభ కోసం వైఎస్సార్సీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.