జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న జగన్ ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైయస్సార్ లా నేస్తం నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. తద్వారా అర్హులైన 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమ చేశారు.
నాలుగేళ్లలో 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు మేలు
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘నాలుగున్నరేళ్లలో రూ.49.51 కోట్లను వైయస్సార్ లా నేస్తం ద్వారా అందించి 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి చేసాం. ఈ కార్యక్రమం ద్వారా ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు దాదాపు 8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. రూ.100 కోట్లను కేటాయించి అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. ఆ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో జూనియర్ న్యాయవాదులకు చాలా మంచి జరిగింది. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతుందో, అలాగే మీరు కూడా పేద వాడి పక్షాన మానవతాదృక్ఫథం నిలిచి ఔదార్యం చూపించాల్సిందిగా ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున మీ అన్నగా, మీ అందరికీ మంచి స్నేహితుడిగా అభ్యర్థిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.