సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే…
రాజానగరం సిద్ధమా… 12 కావస్తోంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి స్నేహితుడికి, ప్రతి సోదరుడికీ… మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ బిడ్డ చేతులు జోడించి పేరు, పేరుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.
మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకోవడానికి జరగబోతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకొండి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకొండి.
దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ 59 నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలోఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందించాం. మళ్లీ చెప్తున్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందించాం.
తమ్ముడు మిమ్నల్నే అడుగుతున్నాను.. అక్కా మిమ్నల్నే అడుగుతున్నాను. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ కావడం జరిగిందా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ అధికారంలోకి వచ్చేవరకు.. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే.. కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2.31వేలు ఉద్యోగాలు రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ జరగనిది, మీ బిడ్డ పాలనలో జరిగించినది వాస్తవం అవునా కాదా . ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఆలోచన చేయండి. మేనిఫెస్టోలో చెప్పినది ఏకంగా 99శాతం అమలు చేసి.. ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో అక్కా, చెల్లెమ్మా ఇదిగో మా మేనిఫెస్టో.. ఇందులో చెప్పినవన్నీ మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి… మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్ధం చెబుతూ.. అందులో 99 శాతం హామీలను నెరవేర్చి.. ఆ మేనిఫెస్టోని ప్రతి అక్కకూ, చెల్లెమ్మ ఇంటికి పంపించి.. వారితో టిక్కు పెట్టించి.. వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ల ఆశీస్సులు తీసుకున్న ప్రభుత్వం ఇది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ?
మచ్చుకు నేను గడాగడా ఇప్పుడు కొన్ని పథకాలు చెబుతాను. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరైనా చేశారా ? మీరెప్పుడైనా చూశారా ? అన్నది నేను మిమ్నల్నే ఆలోచన చేయమని కోరుతున్నాను.నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, గవర్నమెంటు బడులలో ఇంగ్లిషు మీడయం, 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్ లలో డిజిటల్ బోధన, 8వతరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు, ఇంగ్లిషు మీడియంతో మొదలుపెడితే 3వ తరగతి నుంచో టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, ఐబీ వరకు ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లిషు మరో పేజీ తెలుగులో అందుబాటులోకి తెచ్చాం. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద ,పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు, పిల్లలకుఅండగా ఉంటూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, పెద్ద చదువుల కరిక్యులమ్ లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలను ఆన్ లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం, ఇంటర్న్ షిప్ ను తప్పనిసరి చేయడం… విద్యారంగంలో నేను చెప్పినవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్కచెల్లెమ్మలు వాళ్లు కాళ్ల మీద వాళ్లు నిలపబడాలని, అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన కోసం ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అందులో కడుతున్నవి 22 లక్షల ఇళ్లు..ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగాయా ? అన్నా నేను మిమ్నల్నే అడుగుతున్నాను. చెల్లెమ్మా మిమ్మల్నే అడుగుతున్నాను. అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేలు పెన్షన్, ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు… ఇలా నేరుగా మీ ఇంటి వద్దకే రేషన్, పథకాలు వంటివి గతంలో ఎప్పుడైనా జరిగిందా ? గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి కోసం సాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంట బీమా, సీజన్ ముగిసేలోగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా అందుతున్న ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూడే 9 గంటలకు పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్, గ్రామస్ధాయిలోనే రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ గ్రామస్ధాయిలోనే ఆర్బీకే వ్యవస్ధ.. ఇటువంటి పాలన, రైతన్నను ఇలా చేయిపట్టుకుని నడిపించే అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా ?
స్వయం ఉపాధికిఅండగా ఎప్పుడూ, ఎవరూ ఊహించని విధంగా ఆటోలు, టాక్సీలు నడిపేవారికి తోడుగా వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులు మత్స్యకార భరోసా, చిరువ్యాపాలుకు అండగా ఓ తోడు, ఓ చేదోడు, లాయర్లకు అండగా లా నేస్తం ఈ మాదిరిగా స్వయం ఉపాధికి అండగా నిల్చిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ? గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని… రూ.25 లక్షల వరకు విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష.. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ? అని అడుగుతున్నాను. వీటన్నంటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామంలో 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం. ఆ గ్రామంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వాలంటీర్… అదే గ్రామంలో రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే, దానికి పక్కనే ఓ విలేజ్ క్లినిక్, మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లిషు మీడియం బడి, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, నా అక్కచెల్లెమ్మలకు భద్రతగా, తోడుగా గ్రామంలోనే మహిలా పోలీసు, నా అక్కచెల్లెమ్మలకు తోడుగా వాళ్ల ఫోన్ లలోనే దిశా యాప్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అక్కా జరిగాయా? చెల్లెమ్మా జరిగాయా?
మరోవంక చంద్ర 14 సంవత్సరాలు పాటు 3 సార్లు సీఎంగా చేశానంటాడు.కానీ నేను అడుగుతున్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ పైదకైనా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా?.14 ఏళ్లు సీఎం అంటాడు. 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీం ఏ పేదవాడికైనా గుర్తుకు వస్తుందా ? ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్ధానాలు ఇచ్చి.. ఆ తర్వాత అవి అమలుచేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, సామాజికవర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు, రైతన్నలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు.
ఆ తుప్పు పట్టిన సైకిల్ కు రిపేరు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు. అందులో భాగంగా ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకి వెళ్ళాడు. అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. దత్తపుత్రుడు సైకిల్ మొత్తం చూసి.. సైకిల్ తుప్పుపట్టింది, నేను కేరియర్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ పట్టుకుని తాగుతాను. మిగిలింది నా వల్ల కాదన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడ మెకానిక్స్ ను ఇక్కడికి దింపి.. సైకిల్ ఓ షేపులోకి తీసుకురమ్మని అడిగాడు. ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ ఇక్కడికి వచ్చి.. తుప్పు పట్టిన సైకిల్ ను చూశారు. సైకిల్ కు హేండిల్ లేదు, సీటు లేదు. ఫెడల్స్ లేవు. చక్రాలు లేవు, ట్యూబులు లేవు. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పుపట్టిన సైకిల్ ను ఎలా బాగుచేస్తాం చంద్రబాబూ అని అడిగితే పిచ్చిచూపులు చూస్తూ… ఇదొక్కటే మిగిలిందని బెల్లు చూపించి.. ట్రింగ్.. ట్రింగ్ మని బెల్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ బెల్లు పేరే అబద్దాల మేనిఫెస్టో అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.