2024 సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సినీ హీరో చిరంజీవిచేస్తున్న చర్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి . ఎన్డీఏ కూటమి తరుపున పోటీ చేస్తున్న నాయకులను ఎన్నికల్లో గెలిపించాలని వీడియో బైట్ రూపంలో ప్రజలకు విన్నపించుకున్నారు. కూటమిలో బిజెపి తరుపున పోటీ చేస్తున్న సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్.. జనసేన తరుపున పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు తరుపున వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న చిరంజీవి కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఎలా మద్దతిస్తారని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
చిరంజీవి గతంలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ…నాకు ఏపీలో ఓటు లేదని.. అక్కడ రాజకీయాలతో తనకు సంబంధం లేదని చిరంజీవి తెలిపారు. నాకు ఎక్కడైతే ఓటు హక్కు ఉందో అక్కడ నుంచే తాను మాట్లాడుతున్నా అంటూ చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో పేపర్లు, టీవీలు ద్వారానే తెలుసుకుంటున్నాను తప్పిస్తే..అంతకు మించి తనకు అక్కడ రాజకీయాల గురించి ఎటువంటి ఆసక్తి లేదని ఆయన తెలిపారు.
నా ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏపీ రాజకీయాలపై ఏమాత్రం సంబంధం లేదని తెలిపిన చిరంజీవి ఇప్పుడు ఎలా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. పద్మ విభూషణ్ రాగానే ఇలా కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిస్తే ఎలా అని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తనకు ఇష్టం వచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయ పెడుతున్నారు. మరోవైపు సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేక పోయింది. సినిమాలు చేసుకోకుండా రాజకీయాలు ఎందుకని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.