టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నారని మరో మాజీ మంత్రి కడప జిల్లాలో సీనియర్ నాయకుడు వీరశివారెడ్డి ఆరోపించారు. తనకు కమలాపురం టికెట్ ఇస్తానని టీడీపీలో చేర్చుకుని నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తికి డబ్బులు తీసుకుని టికెట్ కేటాయించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కో సీటుకు చంద్రబాబు నాయుడు 20 కోట్ల నుండి 30 కోట్లు వసూలు చేశారు . మా కమలాపురం నియోజకవర్గంలో టికెట్ కేటాయించిన వ్యక్తి నా స్వగ్రామంలో ప్రచారానికి వచ్చినా, నాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పెత్తందారుల పార్టీలో కొనసాగలేను తొందర్లోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వీరశివారెడ్డి వెల్లడించారు.
ఇప్పటికీ ప్రతీ గ్రామంలో తనకు కార్యకర్తల బలం వుంది. తన తమ్ముడు కొడుకు ప్రవీణ్ కు ప్రొద్దుటూరు టికెట్ ఇస్తామని డబ్బులు ఖర్చు పెట్టించారు, ప్రవీణ్ ఎన్నో కేసులు కూడా పెట్టించుకున్నారు. కానీ చివరకు చంద్రబాబు నాయుడు డబ్బులకు లొంగి వేరే వారికి టికెట్ కేటాయించారు. డబ్బులతో మాత్రమే రాజకీయం చెయ్యాలనుకోవడం, కోట్లు ఖర్చు పెడితే చాలు ప్రజలు ఓట్లు వేస్తారు అనుకోవడం అవివేకమని వెల్లడించిన వీర శివారెడ్డి నేనేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. అసలు ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవదు అంటూ జోస్యం చెప్పారు. ఇప్పటికే వీరశివారెడ్డి తన అనుచరులకు, శ్రేయోభిలాషులకు పార్టీ మార్పు గురించి సమాచారం అందించారు.
ఒకవైపు కమలాపురంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ మేనమామ అయిన మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి పోటి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఒక రౌండ్ ప్రచారం కూడా చేసారు. అదే సమయంలో జగన్ బస్సు యాత్రతో వైసీపీ లో కొత్త జోష్ కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వీరశివారెడ్డి టీడీపీకి రాజీనామా చేసే సంకేతాలు ఇవ్వడంతో కమలాపురం నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ నుండి ముఖ్య నాయకులు అంతా రాజీనామా చెయ్యడంతో కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.