ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం క్రితమే పాఠశాల విద్యా శాఖ నుంచి పదో తరగతి విద్యార్థుల వివరాలన్నీ గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థకు, అక్కడి నుంచి వీఆర్వోలకు చేర్చింది. వీఆర్వోలు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి సమగ్ర విచారణ జరిపిన తర్వాత, స్థానిక గ్రామ/వార్డు సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఆయా విదార్థుల కుటుంబాల సభ్యులందరి పేర్ల మీద కుల ధృవీకరణ పత్రాల్ని ఇంటికే చేర్చేలా విధివిధానాలు రూపొందించారు. అందులో భాగంగా ఇప్పటికే విద్యార్థులకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని సమాచారం.
ఇప్పుడు విషయానికొస్తే … 2019 జనవరిలో అప్పటి ‘తెలుగుదేశం’ ప్రభుత్వం జీవిత కాలపరిమితితో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు విధివిధానాలు సిద్ధం చేశామని, పక్షం రోజుల్లో క్యాబినెట్ సమావేశంలో చర్చించి జీవో కూడా విడుదల చేస్తామని తెలిపింది. మంచి నిర్ణయం కానీ బహుశా వారి ప్రతి ఆలోచన లాగా అది కూడా కేవలం ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లుంది కాబోలు. అందుకే మొన్న విడుదలైన ‘కూటమి మైనస్ బీజేపీ’ వారి 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ‘శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం’ అనే హామీని చేర్చారు. సంవత్సరం రోజులుగా ప్రభుత్వం ఇప్పటికే చేస్తున్న పనిని తాము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం ఆశ్చర్యకరం !
సరే… చంద్రబాబు ఆశపడుతున్నట్టుగా మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే కాలపరిమితి లేకుండా ‘శాశ్వత’ కుల ధృవీకరణ పత్రాలు అందరికీ ఇస్తారనుకుందామంటే …
ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఆదాయ, కుల ధృవీకరణల పత్రాల కోసం అర్హులెవారు కూడా ఏ కార్యాలయానికి వెళ్ళే అవసరం లేకుండా వాలంటీర్లు ధరఖాస్తు నుంచి జారీ వరకు ఇళ్ళ దగ్గరే జరిగేలా చూస్తున్నారు.
ప్రస్తుత విధానాన్ని కొనసాగించడం కాకుండా కొత్తగా వారు ఏం చేయబోతున్నారు ? మళ్ళీ పాతరోజుల్లో లాగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగేలా చేస్తారా ? ఎంతో పారదర్శకంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రూపొందించిన ప్రస్తుత విధానాన్ని కాదని మళ్ళీ ‘జన్మభూమి’ కమిటీల సభ్యుల ప్రమేయం ఉండేలా చూస్తారా ?
ఒకప్పుడు కాళ్ళ చెప్పులరిగేలా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి, జేబులు కాళీ చేసుకుంటే తప్ప చేతికందని ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల్ని నేడు గ్రామ/వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటికే చేరుస్తోంది ప్రస్తుత ప్రజాప్రభుత్వం.