విజయవాడ పశ్చిమ సీటును ఎవరికో ఆంధ్రజ్యోతి ఖరారు చేసేసింది. తెలుగుదేశం వర్గాల నుంచి అందిన సమాచారం అంటూ ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానాలను తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం పశ్చిమ సీటును జనసేనకు కేటాయించింది. కాకపోతే అభ్యర్థిగా ఎవరుంటారో మాత్రం చెప్పలేదు. ఇక్కడ పోటీ చేసేందుకు టీడీపీ నుంచి జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్న, ఎంఎస్ బేగ్, జనసేన నుంచి పోతిన మహేష్ లైన్లో ఉన్నారు. బరిలో ఉండేది నేనేనంటూ ఎవరికి వారు మీడియాలో చెప్పుకొంటున్నారు.
బుద్ధా వెంకన్న నేను చంద్రబాబుకు వీరాభిమాని. ఆయన కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌ను, సీఎం జగన్‌ను, మంత్రులను విపరీతంగా తిట్టాను. నాకే ఇవ్వాలంటూ బల ప్రదర్శన కూడా చేశారు. జలీల్‌ఖాన్ మైనార్టీ కోటాలో తనకే ఇవ్వాలంటున్నారు. మాజీ మంత్రి కొడుకు అయిన ఎంఎస్ బేగ్ కూడా ఆశిస్తున్నారు. ఇక పోతిన మహేష్ అయితే పవన్ తనకు హామీ ఇచ్చారని వేరే వారికి ఇస్తే ఒప్పుకోనని తేల్చి చెప్పారు. ఇంతలో చంద్రబాబు మనిషి రాధాకృష్ణ సీటును సేనకు ఇచ్చేశారు. అయితే పేరు మాత్రం రాయలేదు. దీంతో మహేష్‌కు ఇచ్చేది అనుమానంగానే ఉందని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. జలీల్ఖాన్ను సేనలోకి పంపి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీనిని మహేష్ కొట్టిపారేస్తున్నారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో ఆంధ్రజ్యోతి సీట్లు ప్రకటించి టీడీపీ, జనసేన మధ్య అగ్గి రాజేసింది. కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి తెచ్చింది. తెనాలిలో సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా సీటు నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చింది. దీంతో రాజా వర్గం బాబుకు శాపనార్థాలు పెడుతోంది. తాను చంద్రబాబు మనిషిని అంటూ చెప్పుకొంటూ తిరిగే వెంకన్నకు జ్యోతి సీటు ఎగ్గొట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే ఆయన మాత్రం ఈసారి వదలనని పోటీ చేసి తీరుతానని స్పష్టంగా చేస్తున్నారు. తెలుగుదేశం అధిష్టానం మౌనంగా ఉంటే డ్యామేజీ ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. మరి చంద్రబాబు మనసులో ఏముందో..