కొద్దిరోజులుగా తెలుగుదేశం మేనిఫెస్టో దిగాలుగా ఉంటోంది. ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. పాత సినిమాల్లోని శాడ్ సాంగ్స్ పెట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తోంది.
దీనికి కారణమైన బాబోరు అక్కడికొచ్చి ‘ఏమైంది మేనిఫెస్టో.. ఎందుకిలా ఇలా ఉన్నావ్?’ అనడిగారు.
‘అంతా మీ వల్లే.’ అంది.
‘నేనేం చేశాను?’
‘అప్పుడే మర్చిపోయారా?, అవున్లే మీకెక్కడ గుర్తుంటుంది. ఏనాడైనా నన్ను సక్రమంగా అమలు చేసుంటే కదా.. 2014లో ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చి తీరా గెలిచాక మేనిఫెస్టోని దాచేసిన చరిత్ర మీది. జగనన్న తన మేనిఫెస్టోని భగవద్గీతలా చూసుకుంటున్నారు. మీరేమో నన్ను చిత్తు కాగితంలా చూస్తున్నారు.’
‘అరె.. అవన్నీ ఇప్పుడెందుకు?
‘మొన్న మహానాడులో చాలా హామీలిచ్చి నిన్ను జనాల్లోకి ముందుగానే తీసుకొచ్చా కదా..’ బాబోరు అన్నారు.
‘బాబు సార్.. వాటిని హామీలనరు. కాపీ కొట్టడం అంటారు. ఇప్పటికే అమ్మఒడి ఇస్తాండారు. మీరు దాన్ని నాన్నబుడ్డి అంటూ ఎక్కిరించారు. ఆ విషయం అప్పుడే మర్చిపోయారా?’తెలుగుదేశం మేనిఫెస్టో కోపంగా ప్రశ్నించింది,
‘నేను విజనరీ అబ్బా.. నా సంగతి నీకు తెలీదు.’
‘అబ్బో విజనరీ.. చాలా చూశాంలే..’
‘గొప్పగా అడ్మినిస్ట్రేషన్ చేశా. హైద్రాబాద్‌ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే. ఇంకా చాలా ఉన్నాయ్.’
‘ఇవన్నీ వినివిని నా చెవులు తూట్లు పడిపోయాయ్ బాబూ.. కొత్తగా ఏమైనా చెప్పండి’
‘మొన్న ప్రకటించిన హామీలు చూడు.. నీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి.’
తెలుగుదేశం మేనిఫెస్టో పెద్దగా నవ్వి ‘ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారా?.. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జాబ్స్ కల్పించారు?, ఇంటికో ఉద్యోగం పేరుతో దగా చేసింది మీరే కదా.. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఊదరగొట్టారు. ఇంకోటి నిరుద్యోగ యువతకు నెలకు మూడువేల రూపాయలు ఇస్తానంటారా?.. 2014లో సీఎం అయ్యాక నిరుద్యోగ భృతి ఇచ్చారా?. లేదు కదా.. ఎన్నికలకు మూడునెల్ల ముందు జన్మభూమి కమిటీలు చెప్పినోళ్లకి ఇచ్చారు. రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ సంవత్సరానికి 20 వేలు ఇస్తానంటన్నారు. జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమని రాగం అందుకున్నారు. టైం బాగోలేక మీరొస్తే ఈ హామీని ఎన్నికలకు ఒక నెల ముందు అమలు చేస్తారు. వద్దు బాబోయ్. మిమ్మల్ని నమ్మితే నట్టేట మునిగినట్లే.’
‘నేను మారిపోయా. ఈ జీవితం ప్రజా సేవకే అంకితం. పేదల్ని ధనికులుగా మార్చడమే నా లక్ష్యం.’ బాబోరు అన్నారు.
‘మీరు గెలిచే దాకా ఏమైనా చెప్తారు. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారో అందరికీ తెలుసు. ఇదంతా కాదు. మేనిఫెస్టోని కరెక్ట్‌గా అమలు చేస్తా.. పార్టీ వెబ్సైట్ నుంచి లేపేయనని ఒట్టేయండి.’
‘ఆ ఒక్కటీ అడక్కు..’ అంటూ బాబోరు వెళ్లిపోయారు.
తెలుగుదేశం మేనిఫెస్టో ‘ఈయన మారరు. ఇప్పుడు నా అవసరం కాబట్టి వచ్చి కాసేపు మాట్లాడారు. లేకపోతే హు ఆర్ యూ అనేవారు. నా బతుకింతే..’ మళ్లీ ఏడుపందుకుంది.
– వీకే..