1995 సంవత్సరం. ఫ్రెష్ గా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బాబు మొట్ట మొదటిగా గ్రంధాలయ పుస్తకాల్లో 70 లక్షల కుంభకోణం చేసిన తర్వాత రెండో కుంభకోణానికి కూడా పాఠ్య పుస్తకాలనే ఎంచుకొన్నారు . ఈసారి ఇంటర్మీడియట్ పుస్తకాలు భోంచేశారు .
సాధారణంగా ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కోర్సును అప్డేట్ చేసి, తిరిగి ముద్రించాలని బోర్డు వారి నిబంధన. దానిని అనుకూలంగా చేసుకొని పాఠ్య పుస్తకాల్లోని పేజీలను, క్వాలిటీని తగ్గించి, ఇష్టానుసారంగా రేటును పెంచి, లక్షల రూపాయలు దోచేశారు మన బాబు అండ్ కో .
1995 వరకూ ఇంటర్ తెలుగు లేదా ఇంగ్లీషు పాఠ్యపుస్తకాల ఖరీదు అయిదు రూపాయలుగా ఉండేది. దానిని ఒక్కసారిగా 15 రూపాయలకి పెంచారు. ఇంటర్ ఇంగ్లీషు భాష కోర్సు పాఠ్యాంశాలు 1996-97 సంవత్సరానికి మారాల్సి కూడా ఉంది. 165 పేజీల పుస్తకం ఖరీదు అయిదు రూపాయలుండగా మారిన పుస్తకానికి పదిహేను రూపాయల వెల కట్టారు. పైగా పేజీలు కూడా తక్కువే.
పాఠ్యపుస్తకాల ముద్రణకై టెండర్లు కూడా పిలవబడ్డాయి. ఈ మేరకు ఇంటర్ పుస్తకాలు ముద్రిస్తామంటూ.. వీజీఎస్, విక్రమ్, మారుతి, యస్.చాంద్ మరియు ఢిల్లీ, మీరట్ల నుంచి వచ్చిన ఇంకొందరు పబ్లిషర్లు ఒక్కో పుస్తక ముద్రణకు సుమారు ఏడు రూపాయల చొప్పున తమతమ టెండర్లను కూడా దాఖలు చేసారు. అయితే తక్కువ కోట్ చేసిన సంస్థలను కాదని తన సన్నిహితుడు దివి సుబ్బారావు డైరెక్టర్ గా ఉన్న తెలుగు అకాడమీ పేరిట కోట్ చేసిన ధరల పై రెట్టింపు కన్నా ఎక్కువ ధరలతో ఏకపక్షంగా కాంట్రాక్టును కట్టబెట్టేసారు చంద్రబాబు.
తక్కువ కోట్ చేసిన వారిని కాదని ఇలా సొంత వారికి కట్టబెట్టేటప్పుడు టెండర్లను పిలవడమెందుకని వీ.జీ.ఎస్ సంస్థ ఆ సంవత్సరమే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది కూడా.
ఇంకా అక్కడి నుండి కొత్త కధ నడిచింది. అసలు తెలుగు అకాడమీలో ప్రింటింగ్ యూనిట్టే లేదు. బయట ప్రింటర్లతో నాసిరకం పేపర్లలో ప్రింటింగ్ తూతూమంత్రంగా చేయించి, ఒక్కో పుస్తకానికి ఒకేసారి అయిదు రెట్ల వెల పెంచి మార్కెట్లోకి రిలీజు చేసి అరవై లక్షలు దోచేశారు. ఇదంతా కేవలం ఒక్క ఇంగ్లీషు పుస్తకం పైనే. ఇక మిగతా పుస్తకాల లెక్కలు కూడా తీస్తే ఇన్నేళ్ళ తర్వాత కూడా మనం కళ్ళు తేలేయాలి.
ఈ మొత్తం తతంగం వెనక అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉన్నాడని, ఈ దోపిడీలో కీలక పాత్ర అతనిదేనని అతని పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పలుమార్లు డిమాండ్ చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబు. వెనకుండి నడిపిన వాడినే చర్యలు తీసుకోమని అడుగుతున్నామని తర్వాత కానీ తెలిసి రాలేదు కాంగ్రెస్ వాళ్లకి పాపం .