‘160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్‌సభ సీట్లను కూటమి గెలుస్తుంది’ ది రిపబ్లిక్ జర్నలిస్టు అర్ణవ్ గోస్వామి ఇంటర్వ్యూలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలివి. వీటిని విన్న జనం నవ్వుకుంటున్నారు. బతిమిలాడుకుని ఎన్డీఏలో చేరి నేను సీఎం అయిపోతున్నానంటూ బాబు సంబరపడిపోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో కమలం పార్టీకి అనుకూలంగా ఉన్న జాతీయ మీడియా కాళ్లు, గడ్డాలు పట్టుకుని ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుని తనకు తాను హైప్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2019 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ, అమిత్‌షా, ఇతర బీజేపీ నాయకులను అతి దారుణంగా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు వారితోనే పొత్తుకు తహతహలాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక ఒక పక్క బీజేపీ, మరోపక్క జనసేనను పెట్టుకున్నాడు. అయినా కూడా ప్రజలు నమ్మడం లేదు. టికెట్ల విషయంలో ఇంకా రచ్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర పార్టీలతో పొత్తులు తెలుగు తమ్ముళ్లకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఏ రకంగా చూసినా ఈసారి కూడా ఓటమి ఖాయమని అనేక పెద్ద సంస్థల సర్వే ఫలితాలు వెల్లడించాయి.
ఒంటరిగా, ఉమ్మడి నిర్వహించిన సభలకు జనం నుంచి స్పందన రాలేదు. సూపర్ సిక్స్‌ను ఎవరూ నమ్మడం లేదు. పచ్చ పత్రికల రాతల్ని అందరూ ఛీ కొడుతున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. జాతీయ మీడియా సాయం కోసం ప్రయత్నించాడు. ఎవరూ ఈయన్ను దగ్గరకు తీసుకునే సాహసం చేయలేదు. దీంతో బాబు బీజేపీ మౌత్‌పీస్ ది రిపబ్లిక్‌ను ఆశ్రయించాడు. తాము గెలుస్తున్నామని నమ్మించేందుకు ఇదే కరెక్ట్ అని సీఎం రమేష్, సత్యకుమార్ ద్వారా అర్ణవ్ గోస్వామి ద్వారా ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు.
ఇందులో మోదీని ఆకాశానికి ఎత్తేశాడు. 400కు పైగా సీట్లు వస్తాయని, రాష్ట్రం నుంచి 20 స్థానాలు అదనంగా ఇస్తామని డబ్బా కొట్టాడు. సర్వేల్లో కూటమి ఐదారు స్థానాలకే పరిమితం అవుతుందని వస్తే ఈయన 20 స్థానాలు ఎలా ఇస్తాడో మరి. మోదీని ఉగ్రవాది అన్న నోటితోనే ఆయన నాయకత్వంలో దేశం వెలిగిపోతోందని, గ్లోబల్ పవర్‌గా మారుతోందని పొగిడాడు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు అవాక్కవుతున్నారు. ఇక ఎప్పటి లాగే జగన్‌పై ఇష్టమొచ్చింది మాట్లాడాడు. ఏపీలో బాబును చూసి ఓట్లు వేసే రోజులు కావివి. జనసేన అనే పార్టీ ఉందని చాలామందికి తెలియదు. బీజేపీని ఇక్కడ పట్టించుకునే వారు లేరు. ఈ క్రమంలో 160 సీట్లు ఎలా వస్తాయో.. బాబు చెప్పిన మాటల్ని తెలుగు తమ్ముళ్లే నమ్మడం లేదు. ఇక సామాన్యుల చెవుల్లో అయితే పూల లేవు.