ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలని టీడీపీ అనేక కుట్రలకు తెరలేపింది. ఆ కుట్రలో భాగంగానే అచ్చెన్నాయుడు, నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్లతో ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసి వాలంటీర్లను పింఛన్ పంపిణీ చేయకుండా విజయవంతంగా టీడీపీ అడ్డుకుంది. దీంతో పింఛన్ లబ్ధిదారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు లబ్ధిదారులు మృతి చెందడం కూడా రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. దాంతో చంద్రబాబు తాము సెల్ఫ్ గోల్ వేసుకున్నామని గ్రహించి దిద్దుబాటు చర్యలకు తెరలేపారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లేందుకు తన అనుకూల మీడియాలో జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేయిస్తున్నా ప్రజలు నిజాలను గ్రహించడంతో చంద్రబాబు పాచికలు పారడం లేదు.
తాజాగా రేషన్ పంపిణీని కూడా అడ్డుకోవడంలో టీడీపీ సక్సెస్ అయింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన అనంతరం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు నడుం బిగించారు. అందులో భాగంగా రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం మొత్తం 9,260 మొబైల్ వాహనాలను సమకూర్చింది. రాష్ట్రంలో దాదాపుగా 1.50 కోట్ల రేషన్ కార్డుల ద్వారా లబ్ది పోందుతున్న లబ్ధిదారులున్నారు. వీరికి నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని ఇంటివద్దకే ప్రతి నెలా రేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు కుట్ర వల్ల లబ్దిదారులకు ఇంటింటికీ వెళ్లి ఇస్తున్న రేషన్ ఆగిపోయింది. దాంతో లబ్ధిదారులు తీవ్రమైన ఎండల్లో ఇబ్బంది పడుతూ రేషన్ షాప్ దగ్గర నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
దీంతో రేషన్ లబ్ధిదారులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. సీఎం జగన్ ప్రజలకు చేస్తున్న సంక్షేమాన్ని ఓర్వలేకే లబ్దిదారులకు నష్టం కలిగేలా ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తున్నారని తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిసినా ఎన్నికల్లో లబ్ది పొందడానికి చంద్రబాబు వెనుకడుగు వేయడం లేదని ప్రజలు దుయ్యబడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తామని, తిరిగి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ నే ఎన్నుకుంటామని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారని చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో తెలియక సతమతమవుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.