సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కూటమితో పొత్తు టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు నేరుగానే చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంత బుజ్జగిస్తున్న అసంతృప్తులు దారికి రావడం లేదు. దాదాపు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ గెలుపుకు సహకరించేది లేదని అసంతృప్తులు బహిరంగంగానే తెగేసి చెబుతున్నారు.
వ్యతిరేకత ఎక్కువ కావడంతో చంద్రబాబు ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఇప్పటికే పి.గన్నవరం అభ్యర్థి రాజేష్ మహాసేన పేరును ప్రకటించిన తరువాత ఆ స్థానాన్ని జనసేనకు కేటయించడం జరిగింది. రఘురామ కృష్ఱంరాజు కోసం ఉండి నియోజకవర్గం అభ్యర్థిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనపర్తి అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. మడకశిర నియోజవర్గ ప్రస్తుత అభ్యర్థి సునీల్ కుమార్ ని కూడా మార్చే పనిలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం, అక్కడ టీడీపీ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరును పరిశీలిస్తున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. తాజాగా మాడుగుల నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది.
మాడుగుల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్ పేరును ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు నియోజకవర్గ ఇంఛార్జ్ పీ వీ జీ కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడులు సైతం పైలా ప్రసాద్‌కు మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు. పైలా ప్రసాద్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అప్రమత్తం అయిన టీడీపీ అధిష్టానం అభ్యర్థి మార్పు దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పేరు తెరపైకి వచ్చింది. మరి అభ్యర్థుల మార్పులు పార్టీ గెలుపుపై ఏ స్థాయిలో ప్రభావం చూపాయో ఎన్నికల రిజల్ట్స్ తరువాత తెలుస్తుంది.