Chandrababu : తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనుభవం ఉందని చంద్రబాబు(Chandrababu)కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఆ సమయంలో కర్నూలు జిల్లాను అభివృద్ధి చేస్తానని ఆచరణకు నోచుకోని హామీలను చంద్రబాబు గుప్పించాడు. వాటిలో ముఖ్యమైన హామీలను వాటి అమలును గమనిస్తే..
– కర్నూలును స్మార్ట్ సిటీగా రూపొందించడం
– నూతన విమానాశ్రయము
– ఓర్వకల్లు వద్ద నూతన పారిశ్రామిక నగరం
– హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన
– టెక్స్టైల్ క్లస్టర్
– కొలిమిగుండ్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్
– ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
– న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
– కర్నూలులో స్విమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
– టూరిజం సర్క్యూట్
– సోలార్ మరియు విండ్‌పవర్
– లైవ్‌స్టాక్ రీసెర్చి మరియు పాలిటెక్నిక్ సెంటర్
– విత్తనోత్పత్తి కేంద్రము
– రైల్వే వాగన్ల మరమ్మతుల కర్మాగారం
– మైనింగ్ స్కూల్
– ఫుడ్ పార్క్
కర్నూలును స్మార్ట్ సిటీ గా రూపొందిస్తానని మొదటి హామీనిచ్చి ఆ మాట ఇచ్చిన రోజునే హామీని గాలికొదిలేసిన చంద్రబాబు కర్నూలును స్మార్ట్ సిటీగా చేయడానికి ఒక్క అడుగు కూడా వేయలేదు. కేంద్రం మన రాష్ట్రంలో ప్రకటించిన 4 నగరాల్లో కర్నూలుకు చోటే దక్కలేదు. కనీసం ఆ జాబితాలో కర్నూలును చేర్పించే ప్రయత్నం బాబు చేయకపోవడం గమనార్హం. కర్నూలు జిల్లాకి ఎయిర్ పోర్ట్ ప్రకటించిన చంద్రబాబు 2017లో జూన్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం ప్రారంభించి టెర్మినల్ బిల్డింగ్స్ , రన్ వేలను మాత్రమే పూర్తి చేసి 2019 ఎన్నికల నేపథ్యంలో డిజిసిఏ నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే హడావిడిగా ఒక్కసారి ప్రారంభించాడు. కానీ మిగిలిన పనులను పూర్తి చేసి, ఏటీసీ టవర్ ను నిర్మించి, డిజిసిఏ నుండి అన్ని అనుమతులు తీసుకుని 25 మార్చి 2021 జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు హడావిడిగా ప్రారంభించిన తర్వాత ఎయిర్ పోర్ట్ ప్రజా వినియోగంలోకి రావడానికి పట్టిన కాలం దాదాపు రెండు సంవత్సరాలు. ఎన్నికల ముందు డ్రామా కోసమే చంద్రబాబు హడావిడిగా ఎయిర్ పోర్ట్ ప్రారంభించారనడం సుస్పష్టం.
ఓర్వకల్లు దగ్గర నూతన పారిశ్రామిక నగరం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు హామీ ఇచ్చిన రోజునే ఆ హామీకి చరమగీతం పాడారు. ఓర్వకల్లు దగ్గర నూతన పారిశ్రామిక నగరం ఆఖరికి ఎల్లో మీడియాలో ప్రతీరోజు ఊదరగొట్టిన గ్రాఫిక్స్ లో కూడా కనబడకుండా పోవడం శోచనీయం. కొలిమిగుండ్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్ పెడతానని హామీ ఇచ్చిన బాబు మరుక్షణమే ఆ హామీకి మంగళం పాడేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ , సోలార్ & విండ్ పవర్, విత్తనోత్పత్తి కేంద్రము, రైల్వే వాగన్ల మరమ్మతులు కర్మాగారం, మైనింగ్ స్కూల్ , ఫుడ్ పార్క్ ఇలా ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఆ తరువాత కనీసం వాటి ప్రస్తావనను ఒక్కసారి కూడా తీసుకురాకపోవడం ప్రజలంతా గమనించాల్సిన విషయంగా చెప్పొచ్చు. స్విమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పిన బాబు ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించి, గవర్నమెంట్ హాస్పిటల్ ను నిర్లక్ష్యం చేసాడు. టూరిజం సర్క్యూట్ అంటూ గుహలు , దేవాలయాలు , వన్యప్రాణులు కేంద్రాలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు అధికారం చేతిలోకి వచ్చిన తరువాత కర్నూలును పట్టించుకున్న దాఖలాలే లేవు.
చంద్రబాబు(Chandrababu) ఇచ్చిన హామీలు నీటిపై రాసిన రాతలు ఒకేలా ఉంటాయనడంలో ఎటువంటి సందేహాలు లేవు. అధికారం కోసం ఇష్టారీతిన హామీలను గుప్పించడం ఒకవేళ అధికారం చేతికి వస్తే ఆ హామీల అమలుకు ఒక్క అడుగు కూడా వేయకపోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. చంద్రబాబు ఇచ్చిన ఆచరణకు సాధ్యం కాని హామీలు ఒక్క కర్నూలుకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతీ జిల్లాకు లెక్కలేనన్ని హామీలిచ్చిచ్చే ఆల్ ఫ్రీ బాబు అధికారం చేతికి వస్తే మాత్రం తన మతిమరుపు వేషాలు వేస్తాడని ప్రజల్లో ఒక భావన ఏర్పడింది. చంద్రబాబు ఇచ్చిన హామీలను వాటి అమలును గమనిస్తే ఆ వాదన నిజమేనేమో అనిపిస్తుంది కూడా.