“యన్టీఆర్ దేవుడు, మహానుభావుడు, మహనీయుడు, ఆయన్ని తలుచుకుని మొదలుపెడితే ఏ పని అయినా అయిపోతుంది” అని తరచూ చంద్రబాబు యన్టీఆర్ జపం చేస్తుంటారు. యుగపురుషుడు అని, మహా మనీషి అని, స్ఫూర్తిదాత అని అంటూ ఉంటారు. టీడీపీ పార్టీ పెట్టి, సీయం అయిన గొప్ప మనిషి యన్టీఆర్ ని చంద్రబాబు పొగడటంలో తప్పేం లేదు.
కానీ, పాతికేళ్ళ క్రితం తాలూకా పేపరు కటింగ్ లు, యన్టీఆర్ ఇంటర్వ్యూ వీడియోలు మాత్రం చంద్రబాబు కి ఇప్పటికీ ఇక్కట్లు తెచ్చిపెడుతూనే ఉంటాయి. “నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి అని బాబు అడిగుంటే ఎప్పుడో ఇచ్చేవాన్ననీ, ఇలా వెన్నుపోటు పొడవటం ఎందుకు” అని అప్పట్లో యన్టీఆర్ అన్న మాటలు ఆంధ్ర ప్రజానీకానికి బోలెడంత విచారాన్ని కలిగించాయి. కలియుగదైవానికి మారురూపులా భావించబడే యన్టీఆర్ నోటి నుండి అత్యంత దీనకర మాటలు రావడం అప్పట్లో చర్చనీయింశమైంది కూడా.
కానీ, బాబుకి ఉన్న మీడియా మేనేజ్మెంట్ తెలివితేటలు వల్ల వాటిని ఎక్కువగా ఏ పత్రికా ప్రచురించకుండా జాగ్రత్తపడి, ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టినా, జర్నలిజం విలువలు పాటించే కొన్ని పత్రికలు ఉండటం వల్ల అవి అలా అయినా ప్రచురితమయి జనానికి చేరువయ్యాయి.
“చంద్రబాబు ఇప్పటికే తొంభై తప్పులు చేసాడని, శిశుపాలుడి తప్పులులా వంద తప్పుల కోసం వేచి ఉంటున్నానని” స్వయంగా పిల్లనిచ్చిన మామగారు అనడమే బాబు కి అతి పెద్ద అయోగ్యతా పత్రం. “ఆయన ఫోటో చూస్తే చాలు అన్ని పనులు వాటంతట అవే జరిగిపోతాయి” అని ఇప్పటికీ చెప్పే బాబు అప్పట్లో మాత్రం యన్టీఆర్ మీద చెప్పులు వేయించి మరీ అధికారాన్ని లాక్కున్నారు.
“అసెంబ్లీలో నా భార్యని అనరాని మాటలన్నీ అన్నారు” అని వలవలా ఏడిచిన బాబు గురించి అప్పట్లోనే యన్టీఆర్ “లక్ష్మీ పార్వతి నా భార్య, భర్త వెంట భార్య రాకూడదా?? మీ ఇంట్లో ఆడవాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా?” అని విమర్శించారు. అందినకాడికి అవకాశాలను లాక్కుని ఎదిగే వ్యక్తి బాబు అని యన్టీఆర్ తన పదవి పోయిన తరువాత చాలాసార్లు అన్నారు.
అసలు బాబు కుటిల రాజకీయం.. యన్టీఆర్ ని గద్దె దింపడంలో లేదు, అతనిని దింపేసి నా తరువాత కూడా ఈ టీడీపీ వాళ్ళందరినీ మూకుమ్మడిగా మభ్యపెట్టడంలో ఉంది. అటువంటి బాబు ఇప్పటికీ యన్టీఆర్ ఫోటో పెట్టుకునే ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లు దండుకుని, ప్రజలు ఎమోషన్స్ తో ఆడుకుని పదవులు దక్కించుకుంటున్నాడు!!