2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెప్పిన హామీలను అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు లాగా ప్రచార ఆర్భాటాలకి మేము దూరం, చేసేది చెప్తాం చేసిందే వివరిస్తాం అంతేగాని చంద్రబాబు లాగా ఏమి చేయకుండా అంతా నేనే చేశానని చెప్పేవాళ్ళం కాదు అని తెలిపారు.
చంద్రబాబు మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో కూటమిలో ఈ మూడు పార్టీలు ఉన్నాయని అప్పుడు ఇచ్చిన 600 హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చారని అడిగారు. 2019లో ఇచ్చిన మా మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్లి మేము ఫలానా మంచి చేసాం, పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని అమలుపరిచాం అనే ధైర్యం మా దగ్గర ఉంది, అదేవిధంగా 2014 కూటమి మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజలను అడిగే ధైర్యం కూటమి అభ్యర్థులకు ఉందా అని ప్రశ్నించారు. అప్పుడు ఇచ్చిన హామీలకు ఎవరు బాధ్యులు అని అడిగారు.
ఇతర రాష్ట్రాల పార్టీల మేనిఫెస్టో , గత వైసిపి మేనిఫెస్టోలోని అంశాలను కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి ప్రచారానికి తెరలేపారన్నారు, పేర్లు మాత్రమే మార్చాడు మిగిలినవి అని అంతే ఉన్నాయి అని తెలిపారు. 2019లో లాగానే 2024లో కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అలివిగాని హామీలను చెప్పలేనన్న సీఎం జగన్ చెప్పిన ప్రతి విషయానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు పేర్ని నాని. గతంలో నవరత్నాలు పేరుతో 9 సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ ఈసారి కూడా అదే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు.