‘విజయవాడకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. 2014-29 మధ్య వంద కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఫ్లై ఓవర్లు.. రోడ్లకు కూడా నేనే నిధులు విడుదల చేయించా’ అని ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు . 15 లక్షల మంది జనాభా ఉన్న విజయవాడ గురించి బాబు ఏనాడు పట్టించుకోలేదని, ఇక డ్రామాలు ఆపాలన్నారు. గొల్లపూడికి దేవినేని ఉమా, వసంత చేసిందేమీ లేదు. వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తాను ఒక్కసారి కూడా శంకుస్థాపనలకు వెళ్లలేదన్నారు.
గొల్లపూడికి సీఎం జగన్ రూ. 210 కోట్ల సంక్షేమాన్ని అందించారు. 40 వేల మంది జనాభా ఉన్న ఆ ప్రాంతంలో రూ.60 కోట్లతో ఎమ్మెల్సీ తలశిల రఘురాం అభివృద్ధి చేశారు. ఇరు రాజకీయ పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు . నా అమరావతి అని చెప్పుకొనే బాబు శాశ్వత సచివాలయాన్ని కూడా కట్టలేకపోయాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.30 వేల కోట్లతో ప్రతీ గ్రామంలో సచివాలయాలు కట్టించారు. దీంతో ప్రభుత్వ పాలన ప్రజల ముంగిటికే చేరింది. సంక్షేమ పథకాలు సులభంగా అందుతున్నాయి.
చంద్రబాబుకు మైనార్టీలంటే పడదు. చిన్నచూపు చూస్తారు. ఆ మోసగాడిని నమ్మొద్దు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు టీడీపీ అధినేత ఆడుతున్న నాటకాలను వాళ్లు గమనించాలి. 2018 సంవత్సరంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా మార్చి మార్చి తిట్టాడు. ఇప్పుడు మళ్లీ భజన చేస్తూ ఆయన అనుగ్రహం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ఓట్ల కోసం మైనార్టీలను బాబు ఎలా వాడుకున్నాడో అందరికీ చెప్పాలి. అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవడం ఖాయమని తేల్చిచెప్పారు .