ఎన్డీఏతో పొత్తు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి నిద్ర లేకుండా చేస్తోంది. నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో బాబు రకరకాల వేషాలు వేస్తున్నారు. ఆ వర్గం ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మైనారిటీల సంక్షేమానికి టీడీపీ ఎంతో కృషి చేసిందని ప్రచారాల్లో చెప్పాలని ఇప్పటికే నేతలను ఆదేశించారు. కానీ ఏదీ వర్కౌట్ అవుతున్నట్లుగా కనిపించడం లేదు.
2018లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. 19 ఎన్నికల సమయంలో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేశారు. సభల్లో ప్రధాని నరేంద్రమోదీని ఇష్టమొచ్చినట్లు తిట్టారు. రంజాన్ తోఫా ఇచ్చానన్నారు. నారా హమారా.. టీడీపీ హమారా పేరుతో సభలు పెట్టి అందరి చేత పొగిడించుకున్నారు. ఇక బీజేపీతో కలిసేది లేదని, తనకు అండగా నిలవాలని బతిమిలాడుకున్నారు. కానీ ముస్లింలు బాబు మాట నమ్మలేదు. 19 ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్పారు.
2024 ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు స్వార్థం కోసం మళ్లీ ఎన్డీఏలో చేరారు. దీంతో ముస్లిం సమాజం టీడీపీపై కన్నెర్ర చేసింది. బాబుకు భయం పట్టుకుంది. అందులో భాగంగా వీలు చిక్కినప్పుడల్లా వారితో సమావేశాలు పెడుతున్నారు. అండగా ఉంటానని, తనను నమ్మాలని చెబుతున్నారు. అయితే వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజాగళం సభల్లో ముస్లింల టోపీ పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. పార్టీ నేతల ద్వారా ఆ వర్గం పెద్దల్ని పిలిపించుకుంటున్నారు. ప్రచార వాహనంపై ఎక్కించుకుని.. ఆ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నారా హమారా.. టీడీపీ హమారా అంటూ ప్లకార్డులను కార్యకర్తలు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నారు.
బాబు పాట్లు చూసి తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. ఎన్డీఏలో చేరడమెందుకు.. ఇప్పుడిలా స్టంట్లు చేయడమెందుకని బహిరంగంగానే వాపోతున్నారు. మైనారిటీల సంక్షేమానికి టీడీపీ చేసింది శూన్యం. తోఫా ఇచ్చామని బాబు డబ్బా కొడుతున్నారు. కానీ హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చడానికి ఇలా చేశారనేది నిజం. తోఫాలో ఇచ్చిన వస్తువులు కూడా నాసిరకమైనవే.. అలాంటి బాబును ఈ ఎన్నికల్లోనూ నమ్మే పరిస్థితి లేదు.