ఆనం రామనారాయణరెడ్డి ఆశలకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెక్ పెట్టేశారు. కోరిన చోట టికెట్ ఇవ్వకుండా మరో నియోజకవర్గానికి తరిమేశారు. దీంతో జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం కుటుంబానికి ఇవే చివరి ఎన్నికలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
రామనారాయణరెడ్డి దివంగత వైఎస్సార్ పుణ్యాన మంత్రి అయ్యారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన వేసిన తప్పటడుగులే శాపాలయ్యాయి. ఆనం ఫ్యామిలీ పనైపోయిందని అందరూ భావించిన తరుణంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో వెంకటగిరి టికెట్ ఇచ్చి గెలిపించారు. అయితే మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న ఆనంను చంద్రబాబు వాడుకోవడం మొదలుపెట్టారు. వారసుల్ని సిద్ధం చేయాలని చూస్తున్న రామనారాయణరెడ్డి తనకు నెల్లూరు సిటీ, కుమార్తె కైవల్యారెడ్డికి ఆత్మకూరు టికెట్లు ఇస్తే సపోర్టు చేస్తానని చెప్పగా నాడు బాబు ఓకే చెప్పారు. ఇంకేముంది జిల్లాలో మళ్లీ చక్రం తిప్పేయొచ్చని భావించి జగన్ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. టీడీపీకి తానే దిక్కనుకున్నారు.
కానీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ రాకతో ఆనం ఆశలన్నీ అడియాశలయ్యాయి. కొంతకాలం క్రితం ఆనంను వైఎస్సార్సీసీ సస్పెండ్ చేయడం టీడీపీలో చేరడం జరిగిపోయింది. అయితే రామనారాయణరెడ్డి ఆటలు సాగలేదు. నెల్లూరు సిటీ సీటును నారాయణ ఎగురేసుకుపోయారు. రూరల్ తలుపులు మూసుకుపోయాయి. ఇక ఆత్మకూరు నుంచే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇష్టం లేదు. కుమారుడు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. అలా అని అన్న వివేకానందరెడ్డి పిల్లల్ని చేరదీయలేడు. ఇక కుటుంబ వారసత్వం ఉండాలంటే తనకు వెంకటగిరి, కుమార్తె కైవల్యారెడ్డికి ఆత్మకూరు టికెట్ ఇప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు వినలేదు. ఒక సీటు మాత్రమే ఇస్తానని, అది కూడా ఆత్మకూరు నుంచి మీరే పోటీ చేయాలని తెగేసి చెప్పారు. దీంతో రామనారాయణరెడ్డి ఎత్తులు వేశారు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని, వెంకటగిరి అయితే గెలిచే అవకాశం ఎక్కువ ఉందని తనవారి చేత ప్రచారం చేయించారు. జగన్ను తిట్టాను కాబట్టి రెండు టికెట్లు ఇవ్వాలని నారా వారిపై ఒత్తిడి తెచ్చారు. కానీ వాడుకుని వదిలేయడం అలవాటున్న టీడీపీ అధినేత ఆయన మాట వినలేదు. ఆత్మకూరు నుంచి పోటీ చేస్తే చేయండి. లేకపోతే పోండి అనే ధోరణి ప్రదర్శించడంతో ఇక ఆనంకు తప్పలేదు.
రెండో జాబితాలో వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు అవకాశం ఇచ్చారు. ఆనంను ఆత్మకూరుకే పరిమితం చేశారు. కైవల్యారెడ్డికి ఎక్కడా స్థానం లేకుండా పోయింది. దీంతో ఆనం అయిష్టంగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.