అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈనెల 10వ తేదీన హైకోర్టు పలు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది.. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రూపొందించిన అలైన్ మెంట్ లో మార్పులు చేసిన విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపైనా కేసులు నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది.
ఇప్పటికే హైకోర్టు మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా.. వాటిలో ఒక్కో కేసులో బెయిల్ రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.