విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు హర్షించి జగన్ ప్రభుత్వం గొప్ప పని చేసిందని కొనియాడారు. అయితే ఎల్లో మీడియా, చంద్రబాబు అండ్ కో విషం కక్కి పైశాచిక ఆనందం పొందింది. సామాజిక న్యాయ మహా శిల్పం విషయంలో ఈనాడు వెళ్లగక్కిన అక్కసు అంతా ఇంతా కాదు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో జాతి గర్వించేలా జగమంతా కనిపించేలా అంటూ హెడ్డింగ్ పెట్టింది. అదే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే సరికి దార్శనికుడి దివ్యస్మృతికి దారుణ అవమానమిది అని పిచ్చిపట్టినట్లుగా రాసిపడేసింది. ఆంధ్రజ్యోతి కూడా తన అన్న ఈనాడు బాటలోనే నడిచింది. దీంతో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును ఈనాడు, జ్యోతి పెద్దలు తట్టుకోలేకపోతున్నారంటూ ఆ పత్రికల కాపీలను వైఎస్సార్సీపీ, దళిత సంఘాల నాయకులు దహనం చేశారు.
అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతోపాటు 20 ఎకరాల్లో స్మృతి వనం నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించి గ్రాఫిక్స్ చూపించారు కానీ నిర్మించలేదు . జగన్ ప్రభుత్వంలో విగ్రహ నిర్మాణం కార్యరూపం దాల్చినా టీడీపీ, పచ్చ పత్రికలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, దళిత సంఘాల నాయకులు వారిపై అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. జగన్ చెబుతున్నట్లుగా మీరంతా పెత్తందారి పోకడలకు పోతున్నారని, ఇది రూపం మార్చుకున్న అంటరానితనం కాదా? అని ప్రశ్నించారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని ఇప్పటి వరకూ టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులు సందర్శించలేదు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి . ఆయన్ను మీరు బహిష్కరిస్తున్నారా?.. దీనికి సమాధానం చెప్పండని అడుగున్నారు.
ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు వెళ్లాయి. వారిలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు తదితరులున్నారు. అయినా ఎవరూ హాజరు కాలేదు. గ్రామాలకు వెళ్లి దళితుల కోసం అది చేశాం.. ఇది చేశాం.. ఇంకా చేస్తామంటూ ప్రతిపక్ష నాయకులు ఉపన్యాసాలు దంచుతుంటారు. అదే సమయంలో బడగు, బలహీన వర్గాల కోసం ఎంతో చేసిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు వెళ్లలేదంటే వారంతా ఆయనపై ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నట్లే కదా.. ఈనాడు, టీవీ-5, ఏబీఎన్ ఛానళ్లు మహానుభావుడి విగ్రహావిష్కరణ జరుగుతుంటే ప్రసారం చేయలేదు? ఇది రాజ్యంగ నిర్మాతకు జరిగిన తీవ్ర అవమానంగా దళిత సంఘాల నాయకులు భావిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం జరిగినా చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, ఇతర విపక్ష పార్టీలకు చెందిన కనీసం ప్రకటన కూడా చేయలేదు. స్వాగతించలేదు. దీనిని బట్టి వారంతా ఆయన్ను ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో తెలుస్తోంది.