పెన్షన్.. ఇది వృద్ధులకు, ఒంటరి మహిళలకు, అనారోగ్యంతో బాధపడేవారికి, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు, డప్పు కళాకారులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు తదితరులకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక భరోసా. ఈ ప్రక్రియ చంద్రబాబు నాయుడు పాలనలో అధ్వానంగా సాగింది. ఇచ్చిన డబ్బు తక్కువ.. చేసుకున్న ప్రచారం ఎక్కువ.. ఒక వైపు జలగల్లా పీడించిన జన్మభూమి కమిటీలు.. మరోవైపు తిరగలేక అల్లాడిన లబ్ధిదారులు.. మరి 2019 నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వైఎస్సార్ పెన్షన్ కానుకను చేతిలో పెట్టి యోగక్షేమాలు అడుగుతున్న పరిస్థితి. ఇచ్చే మొత్తం కూడా గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ.
గత ప్రభుత్వానికి భిన్నంగా..
టీడీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారులకు నెలకు రూ.1,000 మాత్రమే ఇచ్చేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అవ్వాతాతల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి వారికి అండగా నిలవాలని భావించారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లను రూ.3 వేల వరకు పెంచుతానని ప్రకటించారు. దీంతో కంగుతిన్న అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా 2019 సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు పింఛన్ నగదును రూ.2 వేలకు పెంచారు. అయితే ఆయన్ను ప్రజలు నమ్మలేదు. జగన్ సీఎం అయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశల వారీగా పింఛన్ నగదును పెంచింది. గతంలో అర్హత వయసు 65 ఉండగా వైఎస్ జగన్ 60 సంవత్సరాలకు తగ్గించారు. దివ్యాంగులకు రూ.3 వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.5 వేల చొప్పున పింఛన్ నగదు అందజేస్తూ ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ జనవరి నుంచి వృద్ధులు, ఒంటరి మహిళలు తదితరులకు రూ.3 వేలు చేశారు. తెలుగుదేశం హయాంలో లబ్ధిదారులు 39 లక్షల మంది మాత్రమే. మొత్తంగా 27,687 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదే జగన్ హయాంలో లబ్ధిదారులు 66,34,742 మంది. 56 నెలల్లో ఖర్చు చేసింది 84,730.97 కోట్లు. ఇద్దరిలో ఎవరు పేదలకు పెన్షన్ల ద్వారా భరోసా కల్పించారో ఈ గణాంకాలు చెబుతున్నాయి. పైగా
అంతా జన్మభూమి కమిటీలదే..
టీడీపీ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులదే రాజ్యం. వారు పెన్షన్ల లబ్ధిదారులను పెట్టిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఇచ్చే వెయ్యి రూపాయల్లోనూ వాటాల కోసం వేధించేవారు. కొత్తవి మంజూరు కావాలంటే ఏడాదికో లేక రెండేళ్లకో నిర్వహించే జన్మభూమి కార్యక్రమమే గతి. అది కూడా ఆ కమిటీ, అధికారుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరైనా చనిపోతేనో లేక ఇతర కారణాలతో తగ్గితేనే పింఛన్ మంజూరయ్యేది. ఆ కమిటీలు చేసిన అరాచకాలు తలుచుకుంటే ఇప్పటికీ లబ్ధిదారులు వణికిపోతారు. ఒకప్పుడు నగదు తీసుకోవాలంటే సొంతంగా ఖర్చు పెట్టుకుని వెళ్లి క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. అయితే డబ్బు చేతికి అందేంతే వరకు గ్యారెంటీ లేదు.
మరిప్పుడు
అవ్వాతాతలు గౌరవంగా జీవనం సాగించేందుకు పింఛన్ సొమ్ము ఆసరాగా నిలుస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పంపిణీని ప్రారంభిస్తారు. ఇళ్లకే వెళ్లి నగదు అందజేస్తుండటంతో వృద్ధులు, దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు పనిచేస్తున్న ప్రాంతాలకు వెళ్లి నగదు ఇస్తున్నారు. ఎవరైనా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే అక్కడికి వెళ్లి డబ్బు ఇచ్చి అండగా నిలుస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేయించి 29,51,760 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. గతంలో ఉన్న నిబంధనలు తీసేసి పేదల్ని ఉదారంగా ఆదుకున్న ఘనత జగన్‌దే.. అయితే ఎల్లో మీడియా చంద్రబాబు కోసం పింఛన్ తుంచె రాసి పరువు పొగొట్టుకుంది. ఎల్లో గ్యాంగ్ కాస్త కళ్లు తెరిచి ప్రతి వీధికి వెళ్లి పెన్షన్లు ఎవరు బాగా ఇచ్చారో బోసి నవ్వుల అవ్వాతాతల్ని అడిగితే తెలుస్తుంది. ఆ సమయంలో వాళ్లు తిట్టినా భరించాలి మరి..
– వీకే..