అధికారం, హోదా కొంతమంది ప్రజలకు మేలు చేయడానికి వాడితే, మరికొంత మంది ఆ హోదాని అడ్డుపెట్టుకుని తమకి, తమ వారికి లబ్ది చేకూర్చడానికి వాడుతూ ఉంటారు.. ఇటీవల తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆరెస్ పార్టీ ఓటమి పాలయ్యాక గత 9ఏళ్ళుగా ఆ పార్టీలో ఉన్న నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టి ఎలా ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సంచలనం సృష్టించిన ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ మాజీ శాసన సభ్యులు ఆసన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి 7కోట్ల రూపాయలు బకాయి పడటమే.
ఆర్మూర్ ఆర్టీసీకి, ట్రాన్స్ కో స్థలంలో జీవన్ రెడ్డి మాల్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ 9ఏళ్ళ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టి ఏ రోజూ కూడా ప్రభుత్వానికి కట్టల్సిన డబ్బు కట్టకుండా, బకాయిలు కట్టమని అభ్యర్దించిన ట్రాన్స్ కో, ఆర్టీసీ ఆఫీసర్లను బెదిరించారని ఆరోపణలు ఉన్నయి. అయితే ఎన్నికల్లో ఆయన ఓటమి చెందగానే సదరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి 7 కోట్ల బాకీ అనే ఉదంతం బయటికి వచ్చి సంచలనం రేపింది. అధికారం అడ్డు పెట్టి ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టడం అనేది గతంలో సైతం అనేక ఉదంతాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ జాబితాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం ఉన్నారు. ఆయన 14ఏళ్ళ పాలనలో ఇటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నా ముఖ్యంగా చెప్పుకోదగినది శక్తి గ్యాస్ విషయం.
రాష్ట్రంలో ప్రైవేటు గ్యాస్ పంపిణీ దారులలో శక్తి గ్యాస్ ఒకటి. దాని యజమాని రమణ నాడు రాష్ట్రంలోని సంపన్నులలో ఒకరు. హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్టు ప్రక్కనే ఉండే మనోహర్ హోటల్ కూడా ఆయనదే. రాజధాని నగరంలో ఆయనకు నాడే అపారమైన ఆస్తిపాస్తులు ఉండేవి. 1995లో సీఎం అయ్యిన చంద్రబాబుకు ఆ రోజుల్లో రమణ అత్యంత సన్నిహితుడు. అప్పుడప్పుడూ చంద్రబాబు విదేశీ పర్యటనలలో కూడా ఆయన పాల్గొనేవాడు. ఆ రమణకి చెందిన శక్తి గ్యాస్ కంపెనీ కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ కి బాకీ పడిన 33 కోట్ల రూపాయల పన్నును చంద్రబాబు సాయంతో రూపాయి చెల్లించకుండా రద్దు చేయించుకోగలిగాడు.
సంపన్నులను సంతృప్తి పరచడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంత చురుకుగా, సాహసంగా వ్యవహరించగలదో తెలుసుకోవడానికి నాటి ఈ ఉదంతం ఒక నిదర్శనం.. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి కొన్ని రాయితీలు ఇస్తుంది ప్రభుత్వం. అందులో వాణిజ్య పన్నుల మినహాయింపు కూడా ఒకటి. కొత్తగా ఒక పరిశ్రమ ప్రారంభిస్తే ఐదేళ్లపాటు పన్ను వసూలు చేయరు. ఈ నిబంధన క్రింద శక్తి గ్యాస్ కంపెనీ టాక్స్ కట్టకుండా తప్పించారు చంద్రబాబు . అయితే శక్తి గ్యాస్ పరిశ్రమ కాదు ఒక దిగుమతి సంస్థ. విదేశాల నుండి గ్యాస్ దిగుమతి చేసుకుని సిలిండర్లలో నింపి అమ్ముతారు. పరిశ్రమ అంటే వస్తువుల ఉత్పత్తి జరగాలి. ఇక్కడ అటువంటి ఉత్పత్తి ఏమీ లేదు.
చంద్రబాబుతో సాన్నిహిత్యం వల్ల దిగుమతి వ్యాపారం కూడా ఉత్పత్తి పరిశ్రమ అయిపోయింది. వాణిజ్య పన్నుల శాఖలోని ఒక అధికారి ఈ మోసం కనిపెట్టి, శక్తి గ్యాస్ కు పరిశ్రమలకు ఇచ్చే రాయితీ ఇవ్వడానికి లేదని, అభ్యంతరం చెప్పి, నోటీసు జారీ చేశాడు. దానిపై కంపెనీ హైకోర్టుకు వెళ్లింది. న్యాయస్థానంలో ఆ అధికారి అభిప్రాయమే నెగ్గింది. గ్యాస్ ను సిలిండర్లలో నింపి అమ్మడం పరిశ్రమ క్రిందకు రాదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆ తీర్పు అమలు చేస్తే శక్తి గ్యాస్ కంపెనీ వాణిజ్య పన్నుల క్రింద 33 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. కాని సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఒక ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఆ పన్ను రద్దు చేయించాడు. అందులో బాబుకి ఎంత ముట్టిందో, ఇరువురూ ఏ దామాషాలో వాటాలు పంచుకున్నారో. నాడు అందరికి తెలిసిన విషయమే .. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో దిట్టైన చంద్రబాబు శక్తి గ్యాస్ కి మేలు చేయడమే కాక తాను కూడా సులువుగా తప్పించేసుకున్నాడు.
ఇలా కోటాను కోట్ల రూపాయలని అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనునాయులకి పంచుతూ, సామాన్య ప్రజల దగ్గరకి వచ్చేసరికి ఖజానాలో డబ్బులేదని మొహం చాటేయడం చంద్రబాబుకి బాగా తెలిసిన విద్య అని ఆయన 14 ఏళ్ళ పాలనను పరిశీలించి చూసినవారికి అర్ధమౌతుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే అయినా , చంద్రబాబు అయినా ఎవరైనా సరే ప్రభుత్వ డబ్బు దగ్గర నిబద్దత నిజాయతీ చూపించని పక్షంలో వారు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు.