తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానిదే పెత్తనం. మిగిలిన వారిని చిన్నచూపు చూస్తారు. ఇది సత్యం. ప్రధానంగా ఆ పార్టీలో బీసీలకు నరకం చూపిస్తుంటారు. గతంలో కొందరు తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ కన్నీరుమున్నీరైన సందర్భాలున్నాయి.
బాపట్లలో బాబు సామాజిక వర్గం నేతలు బీసీ, ఎస్సీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం స్పందించడం లేదు. నగదు విషయమై యాదవ వర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు మద్దిబోయిన రాంబాబు అడిగినందుకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నరేంద్రవర్మతోపాటు ఆయన తనయుడు రాకేశ్వర్మకు కోపం వచ్చింది. పార్టీ కార్యాలయలలోనే రాంబాబుపై దాడి చేశారు. ఈ ఘటనలో నరేంద్రవర్మ, రాకేశ్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. శనివారం కమ్మ వర్గానికి చెందిన ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు, యాదవ వర్గానికి చెందిన పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావుపై దాడి చేశాడు. ఐటీడీపీ క్షేత్రస్థాయిలో పనిచేయడంలేదని ప్రశ్నించినందుకు బీసీపై ప్రతాపం చూపించారు. సాక్షాత్తు పార్టీ పట్టణాధ్యక్షుడిపైనే దాడి చేయడంతో బీసీ నేతలు లోలోన మదనపడిపోతున్నారు. వారిపై ఫిర్యాదు చేసినా అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోదని, ఇంకా వాళ్ల జోలికి ఎందుకెళ్లారని తమపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తుందని వాపోతున్నారు. గతంలో పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎస్సీ నేత తానికొండ దయాబాబుపై కమ్మ వర్గం నాయకుడు ఇనగంటి శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలోనే దాడి చేశారు. ఇన్చార్జి వర్మ తప్పు చేసిన వారికే మొదటి నుంచి వంత పాడుతున్నారు. దీంతో ఎస్సీలు, బీసీలు రగిలిపోతున్నారు. యాదవ ఓట్లు 20 వేలకు పైగా ఉన్నాయి. అయినా లెక్క చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అధినేత కూడా అంతే..
చంద్రబాబు నాయుడి అహంకారమే చాలామంది టీడీపీ నేతలకు ఉంది. గతంలో బాబు బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు. వాళ్లు న్యాయమూర్తులుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాశాడు. అండగా నిలవాలని కోరిన నాయీ బ్రహ్మణులను తిట్టాడు. తనతో పెట్టుకోవద్దని హెచ్చరించాడు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నాడు.
అండగా ఉంది జగన్ ఒక్కరే
బీసీలను చంద్రబాబు బ్యాక్వర్డ్ క్లాస్‌గా భావిస్తే బ్యాక్‌బోన్ మార్చింది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. 2019 నుంచి ఇప్పటి వరకు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28వ తేదీన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే వెంటనే బాబు కర్నూలు టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి చేత సుప్రీం కోర్టులో కేసు వేయించి వెన్నుపోటు పోడిచారు. బీసీలకు ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఇస్తామని 2014 ఎన్నికల ముందు నారా వారు మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మోసం చేశారు. అలాంటి వ్యక్తికి చెందిన పార్టీలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఎలా అనుకోవాలి. పైగా పేరుకి బీసీని అధ్యక్షుడ్ని చేశారు. కానీ పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాత్ర శూన్యం. బాబు, లోకేశ్ అంతా నడిపిస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్‌లా బీసీలకు దేశంలో ఏ నాయకుడు అండగా నిలబడలేదు. బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చారు. 56 కార్పొరేషన్లు పెట్టారు. ఇటీవల ప్రకటించిన 63 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు ఏకంగా 18 చోట్ల అవకాశం కల్పించారు. 16 లోక్‌సభ స్థానాల్లో 9 మంది బీసీలే ఉన్నారు. ఇదే చంద్రబాబు, జగన్‌కు మధ్య తేడా. టీడీపీ బీసీలను వంచిస్తే.. వైఎస్సార్సీపీ అందలం ఎక్కించింది.