“3.30 కి విజయవాడలో ఆఫీసుకెళ్ళి, 4.20 కి తాడేపల్లిలో ఇంకో ఆఫీసుకెళ్ళాలంటే… ట్రావెలింగుకే అరగంట పడుతుంది. ఇదేం ప్లానింగు??” అని మామూలుగా అయితే మన్మధుడు సినిమాలో నాగార్జునలా, చంద్రబాబు గారు ఆయన పీ.ఏ మీద అరిచేవారే. కానీ ఇలా ఈ ప్రోగ్రాములు సెట్ చేసింది ఆయన పీ.ఏ. కాదు. పలు ప్రభుత్వ శాఖలు.
తనపై నమోదయిన మూడు కేసులకు సంబంధించి చంద్రబాబు ఈరోజు ఆయా కార్యాలయాల ఎదుట హాజరయ్యి బెయిలు కోసం పూచీకత్తులు సమర్పించుకోవలసి ఉంది. బాబు హయాంలో జరిగిన ఇసుక, మద్యం, ఇన్నర్ రింగురోడ్డు అక్రమాలపై కేసులు నమోదు అవగా, హైకోర్టు బెయిలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఆయా బెయిల్సు కోసం చంద్రబాబు ఈ రోజు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంది. ఇందుకోసమై ఉదయం 11 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి, మధ్యాహ్నం 3.30 కు ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి, ఆపై 4.20 గంటలకు తాడేపల్లి సిట్ కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంది. అధికారంలో ఉన్నపుడు ఆఫీసులను ఆకస్మిక తనిఖీలు చేస్తూ, అధికారులను పరుగులు పెట్టించారు అని సొంత పేపర్లలో గప్పాలు కొట్టించుకున్న బాబు, మరి ఇపుడు ఎక్కే మెట్టు దిగి మెట్టు చందాన ఇలా పలు ఆఫీసులకు వెళ్ళడాన్ని ఎలా చిత్రీకరించుకుంటారో చూడాలి.