కోట్ల మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొంది, రాముడి గా, కృష్ణుడిగా ప్రతి ఇంట్లో గోడ మీద ఫొటోలో దేవుడై నిలిచి పోయిన మనిషి, తెలుగు రాజకీయాల్లో సినిమా గ్లామర్ తో ఒక ప్రభంజనం సృష్టించిన మనిషి, ముఖ్య మంత్రిగా ఉండి సన్యాసి వేషం తో సంచలనాలు సృష్టించిన మనిషి… ఒకానొక తెల్లవారు జామున గుండెపోటుతో కుప్పకూలి మరణించడానికి కేవలం గుండెపోటే కారణం కాదు.
అంతకు మించిన అల్లుడి వెన్ను పోటే ప్రధాన కారణం.
ఎన్ టీ ఆర్ తన రాజకీయ ప్రవేశం ఆలోచన కు అనుగుణంగానే అండగా ఉంటాడని, వెన్నండి ఉంటాడని కూతురు భువనేశ్వరిని చంద్రబాబు నాయుడు కి ఇచ్చి పెళ్ళి చేయడం జగమెరిగిన సత్యమే . కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే మామ పైనైనా పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికి మామ ప్రభంజనంలో ఘోర ఓటమి పొంది అతీ గతీ లేకుండా , గుర్తింపుకు నోచుకోకుండా పడి ఉన్న చంద్రబాబు మామను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలనుకున్నదీ వాస్తవమే.
ఎదగడం ఎక్కడైనా హర్షణీయమే. ఎదిగిన తర్వాత అందుకు కారణమైన వారిని తొక్కేయడం మాత్రం పరమ ఘోరం. మనుషులు చేసే పని కాదు, ఏరు దాటక ముందు ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టు, ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.. ఇలా నమ్మక ద్రోహానికి ఎన్ని సామెతలుంటే అవన్నీ ఆ దశమ గ్రహానికి వర్తిస్తాయి.
అధికారం తనకు అందని ద్రాక్ష అవుతుందేమో అన్న భయంతో, మామ తర్వాత పార్టీ పగ్గాలు తన చేతికి రావేమో అన్న ఆందోళనతో, ఉచ్ఛ నీచాలు మరిచి, దొంగదారుల్లో వెన్ను పోటుకు తెగబడి, ఎన్ టీ ఆర్ మరణానికి కారణమయ్యాడు బాబు . ఆయన విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు కావచ్చు,నటరత్న కావచ్చు, అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నగారు కావచ్చు. పచ్చ బాబు చాణక్యం ముందు మాత్రం కుదేలై పోయి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యుడై పోయాడు.
తన నుంచి అధికారం లాక్కున్న బాబుని ఎన్ టీ ఆర్ సహించలేక పోయాడు. భరించ లేక పోయాడు. క్షమించ లేక పోయాడు. బాబుని బర్తరఫ్ చేయమని గవర్నర్ కి కోటి సంతకాలతో వినతి సమర్పించాలని సన్నాహాలు చేసుకున్నాడు. డిసెంబర్ లో ఆయన దీని గురించి ఆలోచించగా, జనవరి లో ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు మరణానికి తల వంచాడు
ఇవాళ్టి రోజున టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్ టీ ఆర్ వర్థంతిని చంద్రబాబు జరపడం, ఆయన ఫొటోకి దండ వేయటం, నిమ్మకూరు వెళ్ళి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం ఇదంతా ఒక వ్యక్తిత్వ దిగజారుడు తనానికి ఎంత చక్కని ఉదాహరణ!!
పైగా ఎన్ టీ ఆర్ మరణించగానే బాబు పలికిన పలుకులు చూడండి.
“ఆయన ప్రజల దైవం. రాష్ట్ర ప్రజలను ఆయన మరణం శోక సంద్రంలో ముంచేసింది. రాష్ట్రం ఒక ప్రముఖ వ్యక్తిని, కళాకారుడిని కోల్పోయింది.రాజకీయాల్లో ఒక విశిష్ట వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఆయన నిలిచారు. కోట్ల ఆదాయం వచ్చే సినిమా రంగాన్ని వదులుకుని ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు”
ఇంతకంటే దివాలా కోరు మనిషిని చూడగలమా ?
ఏ కార్యాలయంలో ఆయన స్థాపించిన పార్టీని ఆయన నుంచి బలవంతాన లాక్కున్నారో, ఏ కార్యాలయంలో అయితే ఆయన్ని నిస్సహాయుడిని చేసి నిలబెట్టారో, ఏ కార్యాలయంలో అయితే ఆయన తో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తన వైపు కుట్ర పన్ని లాక్కున్నాడో, అదే కార్యాలయంలో ఆయన వర్థంతికి బాబు నివాళులు అర్పించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు గా లేదా?
చచ్చిన వాడికి పిండం, చంపిన వాడికి దండం అన్నట్టుగా ఉన్న ఈ పరిస్థితినిని చూస్తూ, ఎన్ టీ ఆర్ పిల్లలు, తండ్రి చావుకి పరోక్ష కారణమైన వ్యక్తితో అంటకాగుతూ ఉండటం చూస్తే, ఔరా అధికారానికెంత శక్తి? డబ్బుకెంత విలువ? అనుబంధాలెంత బలహీనమైనవి అనిపించక మానదు
ఎన్ టీ ఆర్ బొమ్మ పెట్టుకోకుండా గెలిచే దమ్ము లేని బాబు, ఆయన గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటే ఆయన పిల్లలకేమో గానీ, ఆయన అభిమానులకు మాత్రం కడుపు రగిలి పోతుంది.
ఎన్ని జన్మలెత్తినా ఎన్ టీ ఆర్ ఆత్మ చంద్రబాబుని క్షమించడం మాత్రం జరిగే పని కాదేమో