వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. సభల్లో ప్రసంగాలతో ప్రతిపక్షాలపై జగన్ చెలరేగుతున్నారు. బస్సు వద్దకు వచ్చే జనంతో మమేకమై సమస్యలు తెలుసుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సీఎంను కలిసి వినతులు అందజేస్తున్నారు. వారికి సాయం చేస్తానని భరోసానిస్తున్నారు. 20వ రోజు విశాఖపట్నం జిల్లాలో అశేష జనవాహిని నడుమ జరిగింది. తొలుత అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాళెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎంను అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. ఆయన వారిని పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
పెందుర్తి నియోజకవర్గం లక్ష్మీపురం జంక్షన్‌కు యాత్ర చేరుకోగా చేరుకున్న సీఎం జగన్‌కు మహిళలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకిరువైపులా ఉన్నవారికి జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి పినకాడి జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో గజమాలతో కార్యకర్తలు స్వాగతం పలికారు. పినగాడి జంక్షన్లో జననేతకు విశాఖ వాసుల నుంచి అద్భుత స్వాగతం లభించింది. రోడ్డుకిరువైపులా జనం వేల సంఖ్యలో బారులు తీరారు. సీఎం బస్సు దిగి నేరుగా ప్రజలతో ముచ్చటించారు. గోపాలపట్నం చేరుకున్న బస్సు యాత్రకు ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా అడుగడుగునా నీరాజనం పలికారు. వేపగుంట చేరుకోగా మేమంతా సిద్ధమంటూ ప్రజలు కదం తొక్కారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద జన సందోహం నడుమ యాత్ర జరిగింది. అనంతరం కంచరపాళెం, అక్కయ్యపాళెం, మద్దిలపాళెం, వెంకోజిపాళెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు.