ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణస్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నీతి అయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రతిపాదించిందని, వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అథేంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సూచించింది. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగింది. దళారి వ్యవస్థ ఉండకూడదని ఈ యాక్ట్ తెస్తున్నాము. భూమి పేపర్లకు జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిరాక్స్ పేపర్లు ఇస్తారనేది అబద్ధం. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోనే వాళ్లం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలకు సలహాలు సూచనలు ఇచ్చింది. ఇంకా యాక్ట్ అమల్లోకి రాలేదు కానీ, రాని యాక్ట్‌ను తొలగిస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్న చంద్రబాబు బీజేపీ నుంచి స్పష్టత తీసుకోవాలని కోరారు. ప్రజలలో తప్పుడు అపోహ సృష్టించాలని చూస్తున్న ప్రతిపక్షాల ఆలోచన బాధాకరమని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాము అని తెలిపారు. ప్రజలకి మంచి చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని ప్రజలకి హాని తలపెట్టే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయదని మరోసారి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ క్రిమినల్స్‌లాగా మాట్లాడుతున్నారు. ప్రజల ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలనేది సీఎం జగన్ ఆలోచన. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై మూడు సార్లు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు అభ్యంతరం తెలుపని టిడిపి నాయకులు, ఎన్నికల వేళ అసత్య ప్రచారం చేయడం విడ్డూరమని మండిపడ్డారు.