మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిసిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలిపారు.
విశాఖలో సోమవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ..ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. లీడర్‌కు, ప్రొవైడర్‌కు కూడా పీకేకు తేడా తెలియడం లేదా?. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ లీడర్, చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్. చంద్రబాబు చేసేది మేనేజ్ మెంట్.. బ్రోకరిజం. అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నాడు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఆంధ్ర ప్రదేశ్ లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ నిర్ణయాలతోనే విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చాం. గత ఐదేళ్లలో సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో కూడా ముందుంది. జీడీపీలో ఏపీ నాలుగో స్థానంలో వుంది. నీతి అయోగ్ విశ్లేషణలలో, పీఎం అడ్వైజరీ కమిటీ నివేదికల్లోనూ ఏపీ ముందుంది. గతంలో నీతి అయోగ్ విశ్లేషణల 16వ స్థానంలో , పీఎం అడ్వైజరీ కమిటీ లో 15 స్థానాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు నాలుగైదు స్థానాల్లో నిలుస్తోంది. సీఎం జగన్ తీసుకున్న సంస్కరణలతోనే ఈ అభివృద్ధి అంతా సాధ్యమైంది అని బొత్స అభిప్రాయపడ్డారు.
బొత్స సత్యనారాయణ ప్రశాంత్ కిషోర్ ను సూటిగా ప్రశ్నిస్తూ ఇప్పటివరకు బీహార్‌లో ఏం చేశావు? ఎందుకు అక్కడి ప్రజలు నిన్ను వెనక్కి పంపించారు. అసలు చంద్రబాబు పాలన పై ప్రశాంత్ కిషోర్ ఎందుకు మాట్లాడడం లేదు.ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ తీసుకుంటారు. ఇచ్చిన వాళ్లని ఇంద్రుడు, చంద్రుడు అని పొడుగుతారు. ప్రశాంత్ కిషోర్ ఏది మాట్లాడితే అది మొదటి పేజీలో వేసి ఎల్లో మీడియా ఆనందపడుతోంది. ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని బొత్స సత్యనారాయణ మీడియాతో వెల్లడించారు.
ప్రజల దృష్టిలో లీడర్ అంటేనే జగన్. సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక ధైర్యం. ఆయన ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారనే విషయం ప్రశాంత్ కిషోర్ గుర్తించాలి అని మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు.